మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుతో తలెత్తిన ప్రతిష్టంభన కొనసాగుతోంది. దేశ రాజధాని నేపిడాలోని ప్రభుత్వ గృహ సముదాయంలో దాదాపు 400 మంది ఎంపీలు మంగళవారం కూడా నిర్బంధంలోనే ఉన్నారు. బయటకు వెళ్లేందుకు తమను అనుమతించడం లేదని ఓ ఎంపీ తెలిపారు. గృహ సముదాయంలో పోలీసులు, దాని వెలుపల సైనికులు కాపలాగా ఉన్నారని చెప్పారు. ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు, ఫోన్‌లో సంభాషించేందుకు మాత్రం పోలీసులు తమను అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడికైనా తరలిస్తారేమోనన్న భయంతో సోమవారం రాత్రి తాము నిద్రించనే లేదని పేర్కొన్నారు. నిర్బంధంలో ఉన్నవారిలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ శాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ సభ్యులతోపాటు పలు పార్టీల ఎంపీలూ ఉన్నారు.
11 మందితో నూతన కేబినెట్
ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ మయన్మార్‌లో ఎన్‌ఎల్‌డీ ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం.. ఉపాధ్యక్షుడు మయింట్ స్వెని తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించింది. ఆ వెంటనే మయింట్ సర్వాధికారాలను సైన్యాధిపతి మిన్ ఆంగ్ లయాంగ్‌కు బదలాయించారు. అత్యయిక పరిస్థితి ఉన్నప్పుడు ఇలా అధికారాలను బదలాయించేందుకు ఆ దేశ రాజ్యాంగం అనుమతిస్తుంది. ఆపై.. లయాంగ్ 11 మందితో నూతన కేబినెట్‌ను ఏర్పాటుచేశారు. అందులోని సభ్యులంతా మాజీ సైనికాధికారులే. కాగా మయన్మార్‌లో ప్రతిష్టంభన నేపథ్యంలో యంగోన్ నగరంలోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అనవసర ప్రయాణాలు చేయొద్దని అక్కడి భారతీయులకు సూచించింది.