మయన్మార్లో రోజురోజుకూ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఉత్తర రాఖైన్లోని సరిహద్దు ప్రాంతాల నుంచి భారీగా భద్రతా దళాలను పలు నగరాల్లో మోహరిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి స్వతంత్ర పరిశోధకుడు ఒకరు బుధవారం తెలిపారు. దీంతో రక్తపాతం, ప్రాణ నష్టం జరిగే అవకాశం పెరుగుతుందని పౌరులు ఆందోళన చెందుతున్నారు.
సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పౌరులపై తొలుత సంయమనంతో వ్యవహరించిన పోలీసులు.. రబ్బరు బుల్లెట్లు, మందుగుండు సామగ్రి పేల్చటం, నీటి ఫిరంగులు వినియోగిస్తున్నారని అక్కడి మీడియా తెలిపింది. మయన్మార్ ప్రజలు అంతర్జాతీయ సమాజ మద్దతు కోరుతున్నారని పేర్కొంది.
దేశ మిలిటరీ ఏం చేయగలదో ఇప్పటికే ప్రజలు తెలుసుకున్నారని, భద్రతా దళాల మోహరింపు పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఆండ్రూస్ అన్నారు. అయినప్పటీ పెద్దఎత్తున నిరసనలు చేస్తున్న పౌరులను చూస్తుంటే స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పారు.