తెలంగాణ

telangana

ETV Bharat / international

కిమ్‌ సామ్రాజ్యంలో 'కాఫీ' ప్యాకెట్ రూ.7 వేలు!

కిమ్ పరిపాలిస్తున్న ఉత్తర కొరియాలో నిత్యవసర ధరలు చుక్కలను అంటుతున్నాయి. కరోనా కారణంగా ఇతర దేశాల నుంచి దిగుమతులు ఆగిపోవడం వల్ల ఊహించని విధంగా ఆ వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. దీనికి తోడు వరదల కారణంగా పంట నష్టం కావడం వల్ల కిమ్​ సామ్రాజ్యం తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటోంది.

kim jong
కిమ్​

By

Published : Jun 19, 2021, 8:28 AM IST

అక్కడ ఒక బ్లాక్‌ టీ ప్యాకెట్‌ ధర రూ.5 వేలు, కాఫీ ప్యాకెట్‌ ధర రూ.7 వేలు, కిలో అరటిపండ్ల (దాదాపు 7 అరటిపండ్లు) ధర 3వేలకు పైనే (45డాలర్లు). ఇవీ.. కిమ్‌ సామ్రాజ్యంలో తాజా ధరలు. అవును.. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో నిత్యావసరాల సరకుల ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. సరిహద్దుల్లో ఆంక్షలు, దేశంలో వరదల కారణంగా పంట నష్టంతో ఉత్తర కొరియా లక్షల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఆహార కొరత ఆందోళన కలిగిస్తోందంటూ తాజాగా అధినేత కిమ్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఉత్తర కొరియా దాదాపు 8 లక్షల 60 వేల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార విభాగం (ఎఫ్ఏఓ) అంచనా వేసింది. ఇది ఆ దేశానికి రెండు నెలలపాటు సరిపోయే అహార పదార్థాలతో సమానం. ఇక ఈ ఏడాది ఉత్తర కొరియా 13 లక్షల టన్నుల ఆహార కొరత ఎదుర్కొంటోందని దక్షిణ కొరియా ప్రభుత్వ సంస్థ అంచనా వేసింది. ఇలాంటి నివేదికల నేపథ్యంలో.. తాజాగా జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో మాట్లాడిన కిమ్‌.. దేశంలో ఆహార సరఫరా ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వెంటనే ఆహారోత్పత్తి గణనీయంగా పెంచే మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించడం అక్కడి తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కొవిడ్‌ ఆంక్షలు మరికొంత కాలం కొనసాగించాలని అధినేత కిమ్‌ నిర్ణయించడం గమనార్హం.

సేంద్రీయ ఎరువు కోసం మూత్రం..?

రసాయన ఎరువుల కోసం చైనాపై ఆధారపడిన ఉత్తర కొరియా.. దిగుమతులపై ఆంక్షలతో తీవ్ర ఎరువుల కొరత ఎదుర్కొంటోంది. ఈ సమస్యను అధిగమించేందుకు సేంద్రీయ ఎరువుల తయారీని ప్రత్యామ్నాయంగా భావించింది. సేంద్రీయ ఎరువుల తయారీని వేగంగా చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కంపోస్టులో కలిపేందుకు నిత్యం దాదాపు రెండు లీటర్లు మూత్రాన్ని ఇవ్వాలని అక్కడి రైతులకు ఉత్తరకొరియా అధికారులు సూచించారని అమెరికాకు చెందిన రేడియో ఫ్రీ ఆసియా అనే వార్తా సంస్థ గతనెలలో వెల్లడించింది.

మరోవైపు కరోనా భయంతో వణికిపోతున్న ఉత్తర కొరియా గతేడాది దేశ సరిహద్దులను మూసివేసింది. అటు కీలక వాణిజ్య కేంద్రంగా ఉన్న చైనాతోనూ దిగుమతులను నియంత్రించింది. మునుపటితో పోలిస్తే చైనాతో వాణిజ్యం దాదాపు 90శాతం తగ్గిపోగా.. కేవలం కొన్ని అత్యవసర సరకులు, వస్తువుల దిగుమతిని మాత్రమే అనుమతిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఉత్తరకొరియాలో సంభవించిన తుపాను, వరదలకు అక్కడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఓవైపు కొవిడ్‌ ఆంక్షలు, మరోవైపు ప్రకృతి ప్రకోపం ఉత్తర కొరియా ఆహార ఉత్పత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

సిద్ధంగా ఉండండి..

మరోవైపు, దేశాన్ని అర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తానని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ ప్రమాణం చేశారు. అధికార పక్షం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడిన కిమ్​.. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ల నుంచి దేశాన్ని ముందుకు నడుపుతానని ప్రకటించారు. ఆహార కొరత సమస్య ఉందన్న విషయాన్ని అంగీకరించారు.

ఈ సందర్భంగా.. అమెరికాతో చర్చలకైనా, పోరుకైనా సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్యలు జరపడానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ దూతగా సుంగ్ కిమ్ నేడు దక్షిణ కొరియాకు చేరుకోనున్న నేపథ్యంలో కిమ్​ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇదీ చూడండి:డ్రాగన్‌ దూకుడుకు అమెరికా ముకుతాడు

ABOUT THE AUTHOR

...view details