ఆర్టికల్ 370 రద్దు తర్వాత అంతర్జాతీయ వేదికల మీద భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు పాక్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అయినప్పటికీ పాక్ నేతలు తమ నోటి దురుసును వదలిపెట్టడం లేదు. పాకిస్థాన్ రక్షణ, అమరవీరుల దినోత్సవం సందర్భంగా కశ్మీర్ తమ భూభాగంలో అంతర్భాగమనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.
"కశ్మీర్ పాకిస్థాన్‌కు మెడలోని నరం వంటిది. జమ్ముకశ్మీర్‌లో ప్రత్యేక ప్రతిపత్తిని ఎత్తివేయడం వల్ల దేశ భద్రత, సమగ్రతకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆర్టికల్ 370 ఎత్తివేత తర్వాత జమ్ముకశ్మీర్ పరిస్థితిపై ప్రపంచ దేశాలు సహా ఐక్యరాజ్యసమితికి వివరించేందుకు పాక్ చురుకైన దౌత్య ప్రచారం చేస్తోంది. భారత అణ్వస్త్ర కేంద్రాల భద్రతపై ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా దృష్టి సారించాలని అభ్యర్థిస్తున్నాం. లేదంటే దక్షిణాసియాకే కాకుండా ప్రపంచానికే ముప్పు ముంచుకు వస్తుంది. ఇందుకు ప్రపంచ దేశాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది."