ముంబయి ఉగ్రదాడి సూత్రధారి, జమాత్ ఉద్ దవా ఉగ్రసంస్థ అధినేత హఫీజ్ సయీద్‌ను పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రమూకలకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగాలపై ఈ చర్యలు చేపట్టారు.
పలు పెండింగ్ కేసుల్లో తీవ్రవాద వ్యతిరేక కోర్టు ముందు హాజరయ్యేందుకు లాహోర్ నుంచి గుజ్రాంవాలాకు వెళ్తున్నాడు సయీద్. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జుడీషియల్ రిమాండ్‌పై పటిష్ఠ భద్రత కలిగిన కోట్ లఖ్‌పత్ జైలుకు తరలించారు.
సయీద్ నేతృత్వంలోని 'జేయూడీ' సంస్థ లష్కరే తోయిబాను ముందుండి నడిపిస్తున్నట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. 2008లో ముంబయిలో ఉగ్రదాడులకు బాధ్యత వహించింది లష్కరే తోయిబా. ఆ ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు.