తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇన్ని సెలవులు మాకొద్దు అంటున్న జపనీయులు - గోల్డెన్ హాలిడేస్

ఎవరైనా సెలవు దొరికితే పండుగ చేసుకుంటారు. ఆనందంతో ఉప్పొంగిపోతారు. కానీ అక్కడ మాత్రం సెలవులేంట్రా బాబోయ్ అంటున్నారు వేతన జీవులు. జపాన్​లో వరుసగా పది రోజులు సెలవులిచ్చింది ప్రభుత్వం. అక్కడి జనం మాత్రం మాకక్కర్లేదీ సెలవులు అంటున్నారు. ఎందుకు?

సెలవులు మాకొద్దు అంటున్న జపనీయులు

By

Published : Apr 30, 2019, 4:25 PM IST

జపాన్ జాతీయ సంబరాలను పురస్కరించుకుని వరుసగా 10 రోజులు సెలవులిచ్చింది ప్రభుత్వం. ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు ఈ 'గోల్డెన్​ వీక్​' సెలవులు కొనసాగుతాయి. ఓ సర్వే ప్రకారం ఈ సెలవుల పట్ల జపాన్ వేతన జీవులు అసంతృప్తితో ఉన్నారు. యువరాజుకు పట్టాభిషేకం సందర్భంగా ఇన్ని సెలవులు మాకక్కర్లేదు అంటున్నారు.

ఎక్స్​పెడియా జపాన్ అనే సంస్థ సర్వే ప్రకారం.. జనాభాలో సగం మంది సెలవుల పట్ల అసంతృప్తితో ఉన్నారు.

కొందరైతే "ఈ శతాబ్దంలోనే అత్యంత అర్థంలేని ఆలోచన" అంటూ సెలవులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సెలవులు ధనికులకే మేలు చేస్తున్నాయి తప్ప ఇతరులకు ఒరిగిందేమీ లేదని మండిపడుతున్నారు.

ఇదీ కారణం...

రవాణా ఖర్చులు పెరిగాయి. పర్యటక ప్రాంతాలు రద్దీగా మారాయి. బ్యాంకులు, పిల్లల సంరక్షణ కేంద్రాలు మూతపడి ఉన్నాయి.
సేవా రంగ పరిశ్రమల్లో కార్మికులపై పని ఒత్తిడి పెరిగింది. ఉద్యోగుల కొరత మూలంగా సెలవులు దొరకట్లేదు. అందుకే... 10 రోజుల నరకంలాంటి సెలవులు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "ఒకరు తీసుకునే 10 రోజుల సెలవులు ఇంకొకరు 10 రోజులు అదనపు విధులు నిర్వర్తించేలా చేస్తున్నాయి" అని కొందరు వాపోతున్నారు.

"నాకు అసలు విరామం దొరకట్లేదు. 10 రోజులు సెలవులిచ్చిన ప్రభుత్వం ముందుగా సెలవులు తీసుకోలేని సేవా రంగ ఉద్యోగుల గురించి ఆలోచించాల్సింది. కనీసం ఈ పని దినాల్లో వేతనాలైనా పెంచుతారని ఆశిస్తున్నా."
-హోటల్​లో పనిచేసే 30ఏళ్ల యువతి

చాలా మందిది అదే మాట...

600 మంది మహిళలను సర్వే చేయగా.. ఈ సెలవులు శుద్ధ దండగని, ఒత్తిడి పెరిగేందుకు తప్ప మరెందుకూ పనికి రావని ప్రతి ముగ్గురిలో ఇద్దరు వాపోయారు.
చాలా మంది అసలు ఈ సెలవులను ఏం చేసుకోవాలో, ఎలా వాడుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు. చాలా మంది సెలవుల్లో ఇళ్లకే పరిమితమవుతున్నట్లు తేలింది.

చాలా మంది గృహిణులు ఇంటి పని రెట్టింపవుతుందనే భయంతో సెలవులను వ్యతిరేకిస్తున్నారు. పిల్లల సంరక్షణ కేంద్రాల మూసివేతపై నెలలుగా ఆందోళనలు వ్యక్తమవుతునే ఉన్నాయి. సెలవుల్లో పనిచేయాల్సిన వారికి ఇది చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ఆసుపత్రుల్లో వైద్యుల కొరత మరో సమస్య. స్టాక్ మార్కెట్లపైనా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details