తెలంగాణ

telangana

ETV Bharat / international

కల్యాణ మండపాన్ని తలపించే 'ఉప్పు గుహ'! - మృత సముద్రం

'మాలమ్'... ప్రపంచంలోనే అతిపెద్ద 'లవణ గుహ'. ఏడు వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ గుహలపై హిబ్రూ వర్సిటీ భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద 'లవణ గుహలు'

By

Published : Mar 29, 2019, 2:47 PM IST

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద 'లవణ గుహలు'

ఇజ్రాయెల్​లోని సోడెమ్ పర్వతం.. అందులోని మాలమ్ గుహ. దీన్ని గురించి ఎప్పుడైనా విన్నారా? దీని ప్రత్యేకత ఏంటని అనుకుంటున్నారా? ప్రపంచంలోనే అతిపెద్ద 'లవణ గుహ' (సాల్ట్ కేవ్)గా దీనిని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు.!

లవణ గుహలు చాలా అరుదుగా ఉంటాయి. సాధారణంగా ఈ ఉప్పు గుహలు మృత సముద్రం వంటి అత్యంత శుష్క ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. ఇప్పటి వరకు కనుగొన్న లవణ గుహల్లో అతిపెద్దది 'నమక్దన్ గుహ'. దీని పొడవు 4 మైళ్లు. ఎనభైల్లో కనుగొన్న మాలమ్ గుహ 10 కిలోమీటర్ల (6 మైళ్ల) పొడవుతో ప్రపంచంలోనే అతిపెద్ద లవణ గుహగా నిలిచింది.

ఈ మాలమ్ గుహ అత్యంత నవీన లవణ గుహ. ఇది ఏర్పడి ఏడు వేల సంవత్సరాలు అయింది. హాలోసీన్ యుగంలో ఏర్పడిన ఈ గుహలు, లైమ్ స్టోన్ గుహల కంటే ఎంతో నవీన గుహలని పరిశోధకులు తెలిపారు.

ఇజ్రాయెల్, చెక్ రిపబ్లిక్ భూ విజ్ఞాన శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఈ గుహలు బయట ప్రపంచానికి తెలిశాయి. ప్రస్తుతం ఈ గుహపై హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలెం శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేస్తున్నారు.

"ఈ లవణ గుహ పొడవును మేము మళ్లీ కొలవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ గుహ పొడవును 1980ల్లో కొలిచారు. అప్పటి పరికరాలు, పద్ధతుల్లో గుహ పొడవును నిర్ణయించారు. ఇప్పటి మా పరిశోధనల్లో దీని పొడవు 10 కిమీ కంటే ఎక్కువ ఉంటుందని భావిస్తున్నాం. అందుకే ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ లవణ గుహను మళ్లీ సర్వే చేయాలని భావిస్తున్నాం."

- బొజ్ లాంగ్ఫోర్డ్, యూనివర్సిటీ ఆఫ్ జెరూసలెం ఆచార్యుడు

మాలమ్ గుహ ఓ కల్యాణ మండపాన్ని తలపించేలా ఉందని మరో భూ విజ్ఞాన శాస్త్రవేత్త ఎఫ్రాయిమ్ కోహెన్ అభిప్రాయపడ్డారు. "అందమైన ఈ లవణ గుహ చాలా ప్రకాశవంతంగా, శ్వేత వర్ణంలో మెరిసిపోతుంటుంది. అందుకే విశాలమైన ఈ గుహలకు 'వెడ్డింగ్ హాల్' (కల్యాణ మండపం) అని పేరు పెట్టారు. ఈ గుహలను చూడడం అద్భుతంగా ఉంటుంది" అని అన్నారు కోహెన్.

తరచుగా వచ్చే వరదల వల్ల ఈ గుహలు మరింత వృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వరదలు గుహలో సుమారు 19 మార్గాలను ఏర్పరిచాయని గుర్తించారు. వీటిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరముందని వారు తెలిపారు.

ఇదీ చూడండి :విజయం సరే... వ్యర్థాల మాటేంటి: నిపుణులు

ABOUT THE AUTHOR

...view details