అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాము అణుఒప్పందాన్ని ఉల్లఘించనున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తాము యురేనియం శుద్ధి ప్రక్రియను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రతి 60 రోజులకు అణు ఒప్పందానికి కట్టుబడటం తగ్గిపోతుంటుందని హెచ్చరించింది.
అదే సమయంలో, ఒప్పందాన్ని కాపాడటానికి చివరి నిమిషం వరకు చర్చల కోసం ప్రయత్నాలు చేస్తామని ఇరాన్ వెల్లడించింది. ఇరాన్ డిప్యూటీ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్... యూరోపియన్ శక్తులతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నెల చివర్లో మంత్రివర్గ స్థాయి చర్చలు జరపాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు.
బీ కేర్ ఫుల్..
ఇరాన్ అణుఒప్పందం ఉల్లంఘించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. బీ కేర్ ఫుల్ అంటూ హెచ్చరించారు.
"ఇరాన్ తాజాగా ఓ హెచ్చరిక జారీ చేసింది. నూతన అణు ఒప్పందం లేకపోతే.. తమకు కావల్సినంత యురేనియం శుద్ధి చేస్తామని ఇరాన్ అధ్యక్షుడు రొహానీ ప్రకటించారు. బెదిరింపులు చేసిన వారితో జాగ్రత్త. వారు మరలా వచ్చి మమ్మల్ని దెబ్బకొడతారు మునుపెన్నడూ ఎవరూ కొట్టనంతగా." -డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
చర్చిద్దాం... కాస్త ఓపిక పట్టండి..
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రొహానీతో శనివారం ఫోన్లో మాట్లాడారు. యూరోపియన్ దేశాలు, ఇరాన్ కలిసి జూలై 15లోగా చర్చలు పునఃప్రారంభించి ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుగొందామని అన్నారు.