చెట్లు నరికి కాంక్రీట్ వనాన్ని పెంచుతున్నారు మనుషులు. ఈ చర్యల వల్ల పర్యావరణానికి పెనుముప్పు పొంచి వుంది. ఈ విషయమే ఇండోనేసియాకు చెందిన మేడీ బాస్తోనికి తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ విషయంపై వినూత్నంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు.
అంతరించి పోతున్న అడవుల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు దాదాపు 700 కిలోమీటర్ల పాటు వెనక్కి నడిచేందుకు నిర్ణయించుకున్నాడు. తన స్వగ్రామం తూర్పు జావా నుంచి దేశ రాజధాని జకార్తా వరకు వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు. ఒక అద్దాన్ని వీపుకు తగిలించుకుని దాని సహాయంతో వెనక్కు నడుస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నాడు. ఒక్కోసారి ఎంతో అలసట అనిపిస్తుందని.. అయినా భవిష్యత్తు తరాలకోసం ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు.