ఇండోనేషియాలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఏకంగా 54,000 మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. దీంతో.. రోజూవారీ కేసుల సంఖ్యలో భారత్‌ను అధిగమించి.. ఆసియాలో వైరస్ హాట్‌స్పాట్‌గా మారింది ఇండోనేషియా.
ఈ నేపథ్యంలో.. జావా, బాలి దీవుల్లో డెల్టా వేరియంట్ వ్యాప్తి తీవ్రమవుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించి.. పార్కులు, మాల్స్, రెస్టారెంట్లు మూసివేసినట్లు పేర్కొన్నారు.
"జులైలో కొవిడ్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశముంది. వైరస్ వ్యాప్తిని ఇప్పటికీ అదుపు చేయలేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఉన్న ఆంక్షలు మరింత కఠినతరం చేయాలి. డెల్టా వేరియంట్ రెండింతలు వేగంగా వ్యాపిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకోవాలి."