ఇండోనేసియా నిరసనలు హింసాత్మకం అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నిరసిస్తూ ఇండోనేసియాలో చెలరేగిన నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై దాడులకు పాల్పడుతున్న నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. పోలీసుల దాడుల్లో ఇప్పటి వరకు సుమారు ఆరుగురు మరణించగా, చాలా మంది తీవ్రగాయాలపాలయ్యారు. అయితే మరణించిన నిరసనకారుల వివరాలను ప్రభుత్వం అధికారికంగా గుర్తించడంలేదు.
ఇదీ నేపథ్యం..
ఇండోనేసియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో మరోసారి జయభేరి మోగించారు. ఏప్రిల్ 17న జరిగిన ఎన్నికల్లో ఆయనకు 55.5 శాతం ఓట్లు పోలయ్యాయని అక్కడి ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇది అక్రమం..
ఈ ఎన్నికల ఫలితాలను ప్రధాన ప్రత్యర్థి ప్రాబోవో సుబియాంటో తిరస్కరించారు. మోసం జరిగిందని, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సమాయత్తమవుతున్నారు. విడొడోపై తానే విజయం సాధించినట్లు స్వయంగా ప్రకటించుకున్నారు ఈ మాజీ పోలీసు దళాల జనరల్.
ఫలితాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రొబోవో మద్దతుదారులు ఎన్నికల సంఘం కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లదాడి చేశారు. పోలీసుల వసతి గృహానికి నిప్పు అంటించారు.
భారీ భద్రతా ఏర్పాట్లు
రాజధాని జకార్తాలో నెలకొన్న హింసాత్మక ఆందోళనలను అదుపులోకి తెచ్చేందుకు దాదాపు 50 వేల మంది పోలీసు బలగాలను ఇండోనేసియా ప్రభుత్వం మోహరించింది. ఇప్పటికే 20 మంది అనుమానిత నిరసనకారులను అదుపులోకి తీసుకుంది.
ఇదీ చూడండి: డమ్మీ స్మార్ట్ఫోన్లతో దొంగలకే టోకరా...