తెలంగాణ

telangana

ETV Bharat / international

చర్చించుకోండి:భారత్​ పాక్​లకు చైనా సందేశం - మసూద్​ అజహర్

భారత్​ పాకిస్థాన్​లు తమ మధ్య నెలకొన్న సంక్షోభాన్ని ఓ అవకాశంగా మార్చుకోవాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ పిలుపునిచ్చారు. దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతలు రూపుమాపడంలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందన్నారు.

వాంగ్​ యీ, చైనా విదేశాంగ మంత్రి

By

Published : Mar 8, 2019, 5:03 PM IST

భారత్​-పాక్​లు తమ వైషమ్యాలు వీడి సహృద్భావ వాతావరణంలో చర్చలు సాగించాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ అన్నారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను ఒక అవకాశంగా తీసుకుని దాయాది దేశాలు తమ మధ్య దీర్ఘకాల స్నేహపూర్వక సంబంధాల మెరుగుదలకు కృషిచేయాలన్నారు. పుల్వామా ఘటన ముగిసిన అధ్యాయమని, దాని నుంచి ఇరుదేశాలు బయటపడాలని అభిప్రాయపడ్డారు.

"భారత్​-పాక్​లు తమ మధ్య నెలకొన్న ఈ సంక్షోభాన్ని ఓ అవకాశంగా మార్చుకుంటాయని చైనా భావిస్తోంది. అలాగే సహృద్భావ వాతావరణంలో తమ సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా కోరుకుంటోంది." -వాంగ్​ యీ, చైనా విదేశాంగ మంత్రి

దాయాది దేశాలు చర్చల ద్వారా సమస్యల పరిష్కరించుకోవాలని, అందుకు చైనా సహకారం ఉంటుందని వాంగ్​ తెలిపారు. భారత దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను చైనా గౌరవిస్తుందని, దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను రూపుమాపడానికి చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని వాంగ్​ చెప్పారు.

మనం మనం మిత్రులం

అత్యంత ప్రాచీన నాగరికతలు కలిగిన భారత్​-చైనాలు యాంగ్జీ, గంగా నదుల మాదిరిగా తమ మధ్య సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని వాంగ్​ అభిప్రాయపడ్డారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ మధ్య జరిగిన వుహాన్​ సదస్సు గురించి వాంగ్​ ప్రస్తావించారు. ఈ సదస్సు స్ఫూర్తిని ఇరుదేశాలు గౌరవించాలన్నారు. 2018వ సంవత్సరంలో భారత్​-చైనా సంబంధాలు మరింత బలపడ్డాయని వాంగ్​ అభిప్రాయపడ్డారు. అలాగే పాక్​తోనూ తమ మిత్రబంధం కొనసాగుతుందన్నారు.

అంతటికీ మూలం...

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఫిబ్రవరి 14న పాక్ ఆధారిత జైషే మహమ్మద్​ జరిపిన ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్​పీఎఫ్​ జవానులు అమరులయ్యారు. ప్రతీకారంగా భారత్​, పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని జైష్​ ఉగ్రస్థావరాలను నాశనం చేసింది. ప్రతిగా పాక్,​ భారత భూభాగంపై వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడిని భారత్​ సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్​కు చెందిన ఎఫ్​-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. ఈ క్రమంలో భారత పైలెట్​ వింగ్​ కమాండర్​ అభినందన్​ తన మిగ్​ యుద్ధ విమానాన్ని కోల్పోయి పాక్​కు చిక్కారు.

భారత్​ దౌత్యం, అంతర్జాతీయ ఒత్తిడితో, ఇరుదేశాల మధ్య శాంతి సూచికగా భారత్​ పైలెట్​ను విడుదల చేస్తున్నట్లు పాక్​ ప్రకటించింది. అభినందన్​ సగర్వంగా వాఘా సరిహద్దు గుండా భారత్​కు చేరుకున్నారు. అయినా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టలేదు.

చైనా మధ్యవర్తిత్వం...

భారత్​ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఇటీవల తన సహాయ విదేశాంగ మంత్రి కాంగ్​ను పాకిస్థాన్​ పంపించింది. అతను పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​, పాక్​ సైన్యాధిపతి జనరల్​ ఖమర్​ జావేద్ బజ్వా, విదేశాంగ మంత్రి షా మహమూద్​ ఖురేషీ తదితరులతో చర్చించారు. అంతర్జాతీయ ఒత్తిడి దృష్ట్యా భారత్​తో చర్చలకు ప్రయత్నించాలని హితవు పలికారు.

చైనా కుతంత్రం..

ఇదే సమయంలో భారత్​తో పాటు అమెరికా, యూకే, ఫ్రాన్స్​ జైష్​ వ్యవస్థాపకుడు మసూద్​ అజహర్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐరాస భద్రతా మండలిని కోరాయి. ఇక్కడే డ్రాగన్​ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. పుల్వామా ఉగ్రదాడికి ఉసిగొల్పిన అజహర్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా మోకాలడ్డింది. అయితే జైషే మహమ్మద్​ ఇప్పటికే ఐరాస ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉండటం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details