సమాజంతో సంబంధం లేకుండా జీవించటం... ఇదేదో సినిమా కాన్సెప్ట్లా ఉంది కదా! కానీ ప్రస్తుతం జపాన్లో ఇది బాగా ప్రాముఖ్యం పొందిన జీవన శైలి. దీనికి అక్కడి ప్రజలు హికికోమోరి అనే పేరు పెట్టారు.
ప్రసుతం జపాన్లో 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న 6.13 లక్షల మంది హికికోమోరి అనుసరిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన సర్వే నివేదిక తెలిపింది. ఇందులో సగం మంది ఏడు సంవత్సరాల నుంచి సమాజానికి దూరంగా బతుకుతున్న వారే. సమాజానికి దూరంగా బతుకుతున్నవారిలో 75 శాతం పురుషులే కావటం విశేషం.
ఒంటరి పక్షులు...
హికికోమోరిలు... కనీసం ఆరు నెలలు కళాశాలకు, ఉద్యోగానికి, మరే పనికీ బయటకు వెళ్లరు. కుటుంబసభ్యులు మినహా ఎవరితోనూ మాట్లాడరు.
జపాన్లో 2016లో ఇలాంటి సర్వేనే చేశారు. అప్పుడు 39 ఏళ్ల లోపు హికికోమోరి ప్రజల సంఖ్య 5.41 లక్షలు. ఇలాంటి ఒంటరి పక్షి జీవితానికి యువతే ఎక్కువ మొగ్గుచూపుతున్నారని అప్పుడు అంచనా వేశారు అక్కడి అధికారులు. ఈ ఏడాది సర్వేతో మధ్య వయస్కుల వారిలోనూ హికికోమోరి ధోరణి పెరిగినట్లు తేలింది.