తెలంగాణ

telangana

ETV Bharat / international

హ్యామ్‌స్టర్‌లకు కరోనా.. చంపాలని ప్రభుత్వం నిర్ణయం.. - hamsters covid-19 news

Hamsters Covid-19: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జంతువులకు ఈ వైరస్‌ వ్యాపిస్తుండడం భయాందోళనలను పెంచుతోంది. హాంకాంగ్‌లో ఎలుక జాతికి చెందిన హ్యామ్‌స్టర్లకు కరోనా సోకింది. సుమారు 11 హ్యామ్‌స్టర్‌లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.

hamsters covid-19
హ్యామ్‌స్టర్‌లకు కరోనా

By

Published : Jan 19, 2022, 5:41 AM IST

Hamsters Covid-19: చైనా పాలనలోని హాంకాంగ్‌ సైతం కరోనా కట్టడికి కఠిన నిబంధనలు పాటిస్తోంది. అయితే.. తాజాగా ఇక్కడి ఓ పెంపుడు జంతువుల దుకాణంలో మహమ్మారి కలకలం రేగింది. ఇందులో పనిచేసే వ్యక్తికి డెల్టా వేరియంట్‌ సోకి, అది ఇతరులకూ వ్యాప్తి చెందింది. దీంతో అధికారులు వేల మందిని ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు.

ఈ క్రమంలోనే ఇక్కడి కుందేళ్లు, హ్యామ్‌స్టర్లు(ఎలుక జాతికి చెందినవి) తదితర జంతువులకూ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 11 హ్యామ్‌స్టర్‌లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ఇక్కడి 34 పెంపుడు జంతువుల దుకాణాల్లోని సుమారు రెండు వేల హ్యామ్‌స్టర్‌లను చంపాలని నిర్ణయించారు.

గతేడాది డిసెంబర్ 22 తర్వాత ఇక్కడ ఆ జంతువులను కొనుగోలు చేసిన వారు.. వాటిని తమకు అప్పగించాలని, వీధుల్లో వదలొద్దని చెప్పారు. ఈ మేరకు అత్యవసర సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

"పెంపుడు జంతువుల నుంచి మానవులకు వైరస్‌ వ్యాప్తి చెందుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ, ముందుజాగ్రత్త చర్యగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు హ్యామ్‌స్టర్‌ల దిగుమతులు, అమ్మకాలపై నిషేధం విధించారు" అని చెప్పారు. యజమానులు కూడా వాటిని ముద్దు పెట్టుకోవద్దు"అని హాంకాంగ్‌ ఆరోగ్య కార్యదర్శి సోఫియా చాన్ హెచ్చరించారు.

తమ పెట్‌లను తాకిన తర్వాత, వాటి ఆహారాన్ని, ఇతర వస్తువులను ముట్టుకున్న అనంతరం చేతులు శుభ్రంగా కడుక్కోవాలని స్థానిక వెటర్నరీ అధికారులు తెలిపారు.

ఎవరైనా హ్యామ్‌స్టర్‌లను పెంచుతున్నట్లయితే.. వాటిని బయటకు తీసుకురావద్దన్నారు. ఇదిలా ఉండగా.. దాదాపు మూడు నెలలపాటు ఎలాంటి లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ కేసులు లేని హాంకాంగ్‌లో.. ఈ ఏడాదిలో పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు రాకపోకలు, ఇతర సామాజిక కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తున్నారు.

ఇదీ చూడండి:జోరుగా హిమపాతం- మూతపడిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు

ABOUT THE AUTHOR

...view details