భారత్‌కు ఐక్యరాజ్య సమితి ప్రశంసలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న కృషికి విశేష మద్దతునిస్తున్నందుకు భారత్‌ను ప్రశంసించారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. సభ్యదేశాలకు సహకరించేందుకు అనుమానిత ఉగ్రవాదులను విచారించే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఐరాస.
ఉగ్రవాద వ్యతిరేక విభాగం ప్రారంభించిన ఈ కార్యక్రమానికి భారత్, జపాన్, నెదర్లాండ్స్, ఖతార్, సౌదీ అరేబియా నిధులు అందించనున్నాయి.
ఐరాస ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు 2లక్షల50వేల డాలర్లను మొదటగా భారత్ ఇచ్చిందని తెలిపారు ఐరాస సీనియర్ అధికారి జెల్లే పోస్ట్మా. ఆ తర్వాత ఇతర దేశాలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. భారత్ మద్దతును ఐరాస ఎంతో ప్రశంసిస్తోందన్నారు.
ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్, కెన్యాల్లో జరిగిన ఉగ్రదాడులను మరోసారి ఖండించారు ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్. ఈ దాడులు ఉగ్రవాదాన్ని నాశనం చేయడం ఎంత అవసరమో ప్రపంచానికి చాటాయన్నారు. అన్ని దేశాలు ఐరాసతో కలిసి ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు.