శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా గొటాబయ రాజపక్స శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో రక్షణ శాఖ మాజీ కార్యదర్శి, శ్రీలంక పోదుజన పెరామునా పార్టీ (ఎస్ఎల్పీపీ) అభ్యర్థి గొటాబయ రాజపక్స ఘన విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించింది ఆ దేశ ఎన్నికల సంఘం. ఆయన విజయంతో రాజపక్స కుటుంబీకులు మరోమారు దేశ అత్యున్నత పదవిని చేజిక్కించుకున్నట్లయింది. లంక మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స సోదరుడే గొటాబయ.
13 లక్షల ఓట్ల మెజారిటీ..
ఈస్టర్ సండే రోజున 269 మందిని పొట్టన పెట్టుకున్న చర్చి దాడి అనంతరం జరిగిన కీలక ఎన్నికల్లో విపక్ష పార్టీ భారీ విజయం సాధించింది. అధికార పార్టీ అభ్యర్థి ప్రేమదాసపై సుమారు 13 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు గొటాబయ.
రాజపక్సకు 52.25 శాతం ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి ప్రేమదాసకు 41.99 శాతం, ఇతరులకు 5.76 ఓట్లు వచ్చాయి.
రేపే ప్రమాణ స్వీకారం...
నూతన అధ్యక్షుడిగా గొటాబయ రాజపక్స రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారని శ్రీలంక పోదుజన పెరామునా పార్టీ ప్రకటించింది. ప్రస్తుత అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రధానిగా మహిందా!
లంక నూతన అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన సోదరుడు మహింద రాజపక్సను ప్రధానిగా నియమించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు సిరిసేన.. 2015లో మహింద పాలనను రద్దు చేశారు. ప్రస్తుత ప్రధాని రణీల్ విక్రమ్ సింగే త్వరలోనే రాజీనామా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
చైనాకు అనుకూలం..
చైనాకు బలమైన మద్దతుదారుగా ఉన్న గొటాబయ విజయంతో.. హిందూ మహాసముద్రంలో డ్రాగన్ దేశ కార్యకలాపాలు పెరిగేందుకు మరింత అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: యుద్ధభూమిలా హాంకాంగ్... పోలీసుపై బాణంతో దాడి