ఇతర దేశాలపై దాడి చేసేందుకు తమ భూభాగాన్ని ఉపయోగించబోమన్న ప్రతిజ్ఞకు తాలిబన్లు కట్టుబడి ఉన్నారని అఫ్గానిస్థాన్ నూతన విదేశాంగ మంత్రి మోలావి అమీర్‌ఖాన్ ముట్టాఖీ తెలిపారు. తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేశాక మొదటిసారి మీడియా ముందుకు వచ్చి ముట్టాఖీ మాట్లాడారు. అయితే ఆపద్ధర్మ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందని కానీ, ప్రభుత్వంలో మహిళలకు, మైనారిటీలకు అవకాశం ఇవ్వటం గురించి ఆయన స్పందించలేదు. ఎన్నికల విషయంపై స్పందిస్తూ.. ఇతర దేశాలు అఫ్గానిస్థాన్ అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. అమెరికాతో గతేడాది చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఆల్‌ఖైదా, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు రద్దు చేసుకుంటామన్నారు.
నేరాలకు పాల్పడటం లేదు..
అఫ్గానిస్తాన్‌లోని పంజ్‌షీర్ లోయలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలను తాలిబన్లు ఖండించారు. పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో తాలిబన్ ఫైటర్లు ఎలాంటి యుద్ధ నేరాలకు పాల్పడలేదని తాలిబన్ల ప్రతినిధి, సమాచార, సాంస్కృతికశాఖ డిప్యూటి మినిస్టర్ జబిహుల్లా ముజాహిద్ వ్యాఖ్యానించారు.