పాకిస్థాన్ మాజీ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఉరిశిక్ష విధించిన ఆ దేశ ప్రత్యేక న్యాయస్థానం తన తీర్పులో ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది. శిక్ష అమలుచేసేలోపు గనక ముషారఫ్ మృతి చెందినట్లయితే అతని శరీరాన్ని ఇస్లామాబాద్‌లోని సెంట్రల్ స్క్వేర్ వద్దకు ఈడ్చుకొచ్చి మూడు రోజులపాటు అక్కడ వేలాడదీయాలని విస్తుపోయే తీర్పునిచ్చింది.
167 పేజీల సుదీర్ఘ తీర్పును వెలువరించిన పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వకార్ అహ్మద్ సేత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం... ముషారఫ్‌కు మరణశిక్ష విధించింది. రాజ్యాంగాన్ని కూలదోయడం సహా రాజద్రోహం కేసులో ముషారఫ్‌కు శిక్ష ఖరారు చేసింది. మరణశిక్ష అమలు కంటే ముందే ముషారఫ్ చనిపోతే ఏం చేయాలో కూడా చెప్పింది.
"దోషిని(పర్వేజ్ ముషారఫ్) నిర్బంధించడానికి అన్ని విధాల ప్రయత్నించాలని పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నాం. ఒకవేళ శిక్ష అమలు చేయడానికి ముందే చనిపోతే అతని శరీరాన్ని డీ-చౌక్(ఇస్లామాబాద్, పాకిస్థాన్) వద్దకు లాక్కొచ్చి మూడు రోజులపాటు వేలాడదీయండి."-వకార్ అహ్మద్ సేత్, పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.