జమ్ముకశ్మీర్‌లో రెండు రోజులు పర్యటన చేసిన రాయబారుల బృందంలో భాగం కావాలని భారత ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని రష్యా రాయబారి నికోలాయ్ కుదాషేవ్ అన్నారు.
"జమ్ముకశ్మీర్‌లో పర్యటించే రాయబారుల బృందంలో పాల్గొనాలని కోరుతూ నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. మిగతా రాయబారులను మాత్రం ఆహ్వానించారు. ఇది ప్రైవేటు వ్యవహారం కాదు. బృందంలో ఎవరుండాలనే విషయం సార్వభౌముల నిర్ణయానుసారం ఉంటుంది. "- నికోలాయ్ కుదాషేవ్, రష్యా రాయబారి
కశ్మీర్ పరిస్థితులు పరిశీలన
జమ్ముకశ్మీర్‌ను అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్‌తో సహా 15 మంది రాయబారుల బృందం సందర్శించింది. అక్కడ వారు ఎంపిక చేసిన రాజకీయ నేతలు, పౌర సమాజ సభ్యులతోపాటు మిలిటరీ అధికారులతోనూ మాట్లాడారు.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసింది. ఇది భారత అంతర్గత వ్యవహారం అయినప్పటికీ దాయాది పాకిస్థాన్ ఈ విషయాన్ని అంతర్జాతీయ సంస్థల వద్ద ప్రస్తావించింది. ఫలితంగా కశ్మీర్‌లోని తాజా పరిస్థితులను పరిశీలించడానికి భారత ప్రభుత్వం ఈ విదేశీ రాయబారుల బృందాన్ని ఆహ్వానించింది. ఇంతకుముందు 23 మంది ఈయూ ఎంపీలు కశ్మీర్లో పర్యటించిన విషయం తెలిసిందే.
ఎస్-400 క్షిపణులు
భారత్ తన అవసరాల కోసం ఎస్-400 వైమానిక రక్షణ క్షిపణలను పొందేందుకు రష్యాతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అగ్రరాజ్యం అమెరికా.. ఈ ఒప్పందంపై ముందుకు సాగొద్దని హెచ్చరించింది. అయితే ఎవరి బెదిరింపులకు లొంగేది లేదని భారత్‌కు ఎస్-400 క్షిపణులను అందిస్తామని నికోలాయ్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:దేశార్థికానికి బొగ్గే ఇంధనం