కరోనా విధ్వంసానికి ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య సోమవారంతో 50 లక్షలు దాటింది(Corona Death Toll). వైరస్ సంక్షోభం మొదలై రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే ప్రపంచంలోని పేద, ధనిక అనే భేదం లేకుండా అన్ని దేశాలను కకావికలం చేసింది ఈ మహమ్మారి.
అమెరికా, ఐరోపా సమాఖ్య, బ్రిటన్, బ్రెజిల్ వంటి ఎగువ మధ్య ఆదాయ, ఉన్నత ఆదాయ దేశాలు ప్రపంచం మొత్తం జనాభాలో ఎనిమిదింట ఒక వంతు జనాభా కలిగి ఉన్నాయి. కానీ కరోనా మొత్తం మరణాల్లో మాత్రం ఈ దేశాలకు చెందిన వారే 50శాతం మంది ఉన్నారు. ఒక్క అగ్రరాజ్యం అమెరికాలోనే 7లక్షల 40వేల మంది కరోనాకు బలయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొవిడ్ కారణంగా తీవ్రంగా ప్రభావితమై, అత్యధిక మరణాలు నమోదైన దేశం కూడా ఇదే.
జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ లెక్కల ప్రకారం ఈ కరోనా మరణాల సంఖ్య(covid 19 death toll world) లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో జనాభాతో సమానం. పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఓస్లో అంచనాల ప్రకారం 1950 నుంచి దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో మరణించిన వారి సంఖ్యతో ఇది దాదాపు సమానం. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలకు గుండె జబ్బులు, స్ట్రోక్ తర్వాత కరోనానే మూడో ప్రధాన కారణం.
ఇది మనం జీవితకాలం నిర్వచించుకోవాల్సిన క్షణమని యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అంటువ్యాధుల నిపుణుడు డా.అల్బర్ట్ కో తెలిపారు. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకుని మరో 50లక్షల మరణాలు నమోదు కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించాల్సిన అవసరముందన్నారు.
ఇవి తక్కువే...
నిజానికి ఈ కరోనా మరణాల సంఖ్య(covid 19 death toll worldwide) వాస్తవ లెక్కల కంటే తక్కువే అని నిపుణులు అభిప్రాయపడ్డారు. టెస్టులు పరిమిత సంఖ్యలో చేయడం, కరోనా సోకినా ఆస్పత్రిలో చేరకుండా ఇంట్లోనే మరణించిన వారిని పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంద్నారు. భారత్ లాంటి దేశాల్లో ఇలానే జరిగిందన్నారు.
వైరస్ వ్యాప్తి(coronavirus news) మొదలైన 22 నెలల్లో కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్, తూర్పు ఐరోపాలోని పలు ప్రాంతాల్లో వైరస్ ఉద్ధృతి ఆందోళకర స్థాయిలో ఉంది. ప్రత్యేకించి వదంతులు, తప్పుడు సమాచార వ్యాప్తి, ప్రభుత్వంపై విశ్వసనీయత లేని దేశాల్లో వ్యాక్సినేషన్ నత్తనడకన సాగడం వల్ల మరణాలు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు అర్హులైన వారిలో 17శాతం మందే రెండు డోసుల టీకా తీసుకున్నారు. అర్మేనియాలో అది 7శాతానికే పరిమితమైంది.
కరోనా మహమ్మారి ధనిక దేశాలనే తీవ్రంగా ప్రభావితం చేయడం అరుదైన విషయమని నిపుణులు పేర్కొన్నారు. భారత్‌లో ఈ ఏడాది మేలో కరోనా డెల్టా రకం విజృంభించింది. కానీ ఇప్పుడు రోజువారీ మరణాల సంఖ్య రష్యా, అమెరికా, బ్రిటన్ వంటి ధనిక దేశాలతో పోల్చితే చాలా తక్కువగా ఉంది.
కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో బూస్టర్ డోసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నా.. పేద దేశాల్లోని ప్రజలకు మాత్రం ఇంకా ఒక్క డోసు టీకా కూడా అందలేదు. 130కోట్ల జనాభా ఉన్న ఆఫ్రికాలో కేవలం 5శాతం మందే పూర్తి స్థాయిలో టీకా తీసుకున్నారు. టీకా పంపిణీలో ఆర్థిక సంపదే కీలక పాత్ర పోషించింది.
కరోనా మరణాల్లో టాప్-5 దేశాలు..
- అమెరికా- 7,66,299
- బ్రెజిల్- 6,07,860
- భారత్ - 4,58,470
- మెక్సికో- 2,88,365
- రష్యా- 2,39,693
చైనా డిస్నీల్యాండ్‌లో 33వేల మందికి పరీక్షలు..
- చైనాలోని షాంఘై డిస్నీల్యాండ్‌లో కరోనా పరీక్షలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు అధికారులు(coronavirus update). ప్రత్యేకించి దీనికోసమే పార్కును రెండు రోజులు(సోమవారం, మంగళవారం) మూసివేశారు. సందర్శకులకు అనుమతి లేదని చెప్పారు. శనివారం ఈ పార్కుకు వచ్చిన ఓ వ్యక్తి కరోనా బారినపడినందున ఈ స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 33వేల మంది నమూనాలు పరీక్షించారు.
- సింగపూర్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఐరోపా దేశాల్లా మళ్లీ అనూహ్యంగా కేసులు పెరిగే అవకాశముందని ప్రధాని లీ సియాన్ లూంగ్ ప్రజలను హెచ్చరించారు. జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- దక్షిణ కొరియాలో చాలా నెలల తరువాత భౌతిక దూరం ఆంక్షలను ఎత్తివేసింది ప్రభుత్వం. రెస్టారెంట్లలో ఉన్న పరిమితిని తొలగించింది. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ కోసమే ఈ నిర్ణయం తీసుకుంది.
- కరోనా కారణంగా మూసివేసిన సరిహద్దులను దాదాపు 20నెలల తర్వాత తిరిగి తెరిచింది ఆస్ట్రేలియా. దీంతో సడ్నీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సందడి వాతావరణం నెలకొంది. తమ బంధు మిత్రులను చాలా నెలల తర్వాత చూసిన ప్రజలు.. నిబంధనలు పట్టించుకోకుండా మాస్కు తీసి ఆప్యాయంగా పలకరించుకున్నారు.
- కరోనా కేసులు మళ్లీ పెరిగే ప్రమాదముందని నిపుణలు హెచ్చరించిన నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్ డోసు పంపిణీ ప్రారంభించింది శ్రీలంక. మొదటగా ఆరోగ్య, భద్రత, పర్యటక రంగ సిబ్బందికి ఫైజర్ బూస్టర్ డోసు ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి:కొవిడ్ తర్వాత వేగంగా వ్యాధుల ముసురు.. కారణమిదే...