తెలంగాణ

telangana

ETV Bharat / international

శీతాకాలం కరోనా కాలమే! మరింత విజృంభించే అవకాశం - covid-19 australia news

కరోనా మహమ్మారి ఇక సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశం ఉందిని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తెలిపారు. తేమ తక్కువగా ఉండే శీతాకాలంలో ఈ వైరస్​ విజృంభించొచ్చని పేర్కొన్నారు. శీతాకాలంలో కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాధి వ్యాప్తిపై నిఘా చాలా కీలకమన్నారు.

covid-19 may become seasonal decease
శీతాకాలం కరోనా కాలమే? సీజనల్‌గా విజృంభించనున్న మహమ్మారి

By

Published : Jun 3, 2020, 7:59 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇక సీజనల్‌ వ్యాధిగా మారొచ్చని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాతావరణంలో తేమ ఒక్క శాతం మేర తగ్గినా కొవిడ్‌-19 కేసులు 6% మేర పెరుగుతాయని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. దీని ప్రకారం చూస్తే తేమ తక్కువగా ఉండే శీతాకాలంలో ఈ వ్యాధి విజృంభించొచ్చని వారు పేర్కొన్నారు.

'కొవిడ్‌-19 ఇక సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశం ఉంది. వాతావరణంలో తేమ తగ్గినప్పుడల్లా అది విజృంభించవచ్చు. అంటే.. శీతాకాలాన్ని ఇక కొవిడ్‌ కాలంగా అనుకోవచ్చు' అని పరిశోధనలో పాలుపంచుకున్న మైఖేల్‌ వార్డ్‌ పేర్కొన్నారు. గతంలో వచ్చిన సార్స్‌-కోవ్‌, మెర్స్‌-కోవ్‌ మహమ్మారులకు, వాతావరణానికి మధ్య కూడా సంబంధం ఉందని గతంలో జరిగిన పరిశోధనలు గుర్తించాయని వివరించారు. 'చైనా, ఐరోపా, ఉత్తర అమెరికాల్లో ఈ మహమ్మారి శీతాకాలంలో విజృంభించింది. అందువల్ల కొవిడ్‌ కేసులకు, వాతావరణానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా అన్నది మేం పరిశీలించాం' అని వార్డ్‌ పేర్కొన్నారు. శీతల వాతావరణం కన్నా.. గాల్లో తేమ తక్కువగా ఉండటమే ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణమవుతున్నట్లు తేలిందన్నారు. చలికాలంలో తేమ తక్కువగా ఉంటోందన్నారు. అయితే ఉత్తరార్ధగోళంలో కొన్నిచోట్ల వేసవి నెలల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పారు. అందువల్ల అక్కడ వేసవిలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

'తేమ తక్కువగా ఉన్నప్పుడు గాలి పొడిగా ఉంటుంది. దీనివల్ల గాల్లోని తుంపర్ల పరిమాణం తగ్గిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో.. ఒక రోగి తుమ్ము, దగ్గు ద్వారా వెలువడిన తుంపర్లు గాల్లోకి వచ్చాక తక్కువ పరిమాణాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల అవి గాల్లోనే ఎక్కువ సమయం ఉంటాయి. ఫలితంగా అవి ఇతరులకు అంటుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది' అని చెప్పారు. తేమ ఎక్కువగా ఉంటే ఈ తుంపర్ల పెదదగా, బరువుగా ఉంటాయని, అందువల్ల అవి త్వరగా నేల మీద పడిపోతాయని వివరించారు. శీతాకాలంలో కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాధి వ్యాప్తిపై నిఘా చాలా కీలకమని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details