మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు.. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు దెబ్బతినేందుకు కారణమవుతోంది. దీంతో అక్కడి మిలటరీ వ్యవస్థపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. సైనిక తిరుగుబాటు కారణంగా.. అమెరికాకు చెందిన 1బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు వినియోగించకుండా అడ్డుకట్ట ఏర్పడింది. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలను ఇప్పటికే జారీ చేశారు అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్. ఇకపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేశారు.
గతంలో సైనిక పాలన కొనసాగిన మయన్మార్‌లో.. క్రమంగా ప్రజాస్వామ్య పాలనవైపు అడుగులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంపై గతంలో ఉండే అనేక ఆంక్షలను ఎత్తివేసింది అమెరికా. అయితే.. ప్రజాస్వామ్య నాయకురాలు, నోబెల్ గ్రహీత ఆంగ్ సాన్ సూకీ నిర్బంధంతో మరోసారి సైనిక తిరుగుబాటు ప్రారంభమైంది. ఫలితంగా.. పలు దేశాలు మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ దేశంపై కఠిన చర్యలను అమలు చేస్తున్న దేశాలలో న్యూజిలాండ్ ఒకటి. మయన్మార్‌తో ఇప్పటికే అన్ని రాజకీయ, ఇతర ఉన్నత స్థాయి సంబంధాలను నిలిపివేసింది న్యూజిలాండ్. అంతేకాకుండా.. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన ఎలాంటి చర్యలనైనా అడ్డుకుంటామని ప్రకటించింది.