రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనా మార్చినన్ని సార్లు మ్యాప్‌ను మరే దేశం మార్చలేదంటే అంతిశయోక్తికాదేమో. దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల ఇతర దేశాల భూభాగాల్ని ఆక్రమించిన ఘనత కూడా డ్రాగన్‌కే దక్కుతుంది. ఎప్పటికప్పుడు కొత్తపాట పాడుతూ.. పొరుగు దేశాలతో పేచీలకు దిగడం ఎంతో కొంత భూభాగాన్ని దిగమింగడం డ్రాగన్‌కు అలావాటుగా మారిపోయింది. అదే సమయంలో యుద్ధాలు వచ్చే స్థాయిలో అక్రమణలకు దిగే ధైర్యం చేయదు. చిన్ని..చిన్న భూభాగాలను మెల్లగా తినేస్తుంది. సైనిక పరిభాషలో దీనిని ‘సలామీ స్లైసింగ్’ అంటారు. 2017లో నాటి ఆర్మీ చీఫ్.. నేటి సీడీఎస్ బిపిన్ రావత్ ఈ విషయంలో చైనాకు హెచ్చరికలు జారీ చేశారు కూడా.
అసలు సలామీ స్లైసింగ్ అంటే ఏమిటీ..?
1940 హంగేరియన్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మాథ్యూరకోసీ ఈ పదాన్ని వాడాడు. ఎదుట పార్టీలను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి కలిపేసుకోవడం అన్నమాట. దీనిని ‘క్యాబేజీ వ్యూహం’ అని కూడా అంటారు. పొరుగు దేశాల్లోని చిన్ని చిన్న ప్రాంతాలు తమవని చెప్పుకొని వాటిని మెల్లగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం. మీటర్ల నుంచి కిలోమీటర్ల వరకు ఎంతైన ఉండొచ్చు. పొరుగు దేశం అభ్యంతరం చెబితే శాంతి చర్చలపేరుతో విదేశాంగశాఖ రంగంలోకి దిగి బుజ్జగిస్తుంది. అంతేగానీ, భూభాగాలు వెనక్కి రావు. కిలోమీటర్ కోసమో.. కొన్ని వందల మీటర్ల భూభాగం కోసమో పొరుగు దేశాలు యుద్ధానికి దిగవు. చైనా ఇదే వ్యూహాన్ని తరచూ కొనసాగిస్తూ భారీ మొత్తంలో వ్యూహాత్మక స్థానాలను దక్కించుకొంటోంది.
గల్వాన్ లోయా.. పాంగాంగ్ సో సరస్సు కూడా ఇలానే..
భారత్‌లోని గల్వాన్ లోయ, పాంగాంగ్ సో సర్సుల వద్ద కూడా చైనా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది. పాంగాంగ్ సోలోని ఫింగర్ 4 తమదే అని కొత్త వాదన అందుకొంది. వాస్తవానికి చైనా ఫింగర్ 8 వద్దే ఉండాలి. భారత్ ఫింగర్ 4 వరకు ఉండాలి. కానీ, ఫింగర్ 4 వద్ద వరకు వచ్చేందుకు భౌగోళికంగా అనుకూలంగా ఉండంతో చైనా దానిని వాడుకొని అక్కడకు వచ్చేసింది. భారత్ వైపు నుంచి ఫింగర్ 4 శిఖరానికి చేరడానికి నిట్టనిలువునా కొండ ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో చైనా ఫింగర్ 4తనదే అనే వాదన తెరపైకి తెచ్చింది. ఇక గల్వాన్ లోయ గతంలో ఎప్పుడూ వివాదాస్పదంకాలేదు. అది పూర్తిగా భారత్ స్వాధీనంలోనే ఉంది. కానీ, భారత్ దౌలత్ బేగ్ ఓల్డీకు రహదారి నిర్మాణం చేపట్టడంతో ఇప్పుడు గల్వాన్ లోయ కూడా తనదే అనే వాదన తెచ్చింది. గతంలో డోక్లాం కూడలి వద్ద కూడా ఇలాంటి సలామీ స్లైసింగ్‌కే ప్రయత్నించింది. కానీ, అప్పట్లో భారత్ గట్టిగా నిలబడటంతో తాత్కాలికంగా వెనుదిరిగింది.