ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశల్లో చైనాది ప్రథమ స్థానం. అలాంటి దేశంలో జనాభా తగ్గిపోతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. సంతానోత్పత్తి రేటు హెచ్చరిక రేఖకు దిగువకు పడిపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. దీంతో జనాభా వృద్ధి జరగడం కష్టమేనని ఆ దేశ పౌర వ్యవహారాల శాఖ మంత్రి లీ జిహెంగ్ పేర్కొన్నారు.
ఆర్థిక వృద్ధిపై ప్రభావం...
'దేశ జనాభా తగ్గిపోవడానికి పలు కారణాలున్నాయి. ప్రజలు... పిల్లలను పెంచుకోవడానికి ఇష్టపడటం లేదు. దీంతో హెచ్చరిక రేఖ దిగువకు సంతానోత్పత్తి రేటు పడిపోయింది. ఫలితంగా జనాభా వృద్ధి తగ్గిపోతుంది' అని లీ తెలిపినట్లు ఆ దేశ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
ఓ మహిళ సగటు సంతానోత్పత్తి రేటు 2.1. అయితే ప్రస్తుతం ఆ రేటు 1.5కు చేరినట్లు ఇటీవల జరిగిన గణాంకాల్లో తేలింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో జనాభా సంఖ్య తగ్గిపోతుంది. ఫలితంగా ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపనుందని నిపుణులు హెచ్చరించారు.
జననాలపై ఉన్న ఆంక్షలను తక్షణమే ఎత్తవేయాలని, వివాహం తర్వాత పుట్టబోయే పిల్లల విషయంలో ఓర్పుతో ఉండాలని నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. పిల్లల చదువులు, ఇతర ఖర్చులకు అయ్యే వ్యయాన్ని తగ్గించాలన్నారు.
జనాభా వృద్ధిని నియంత్రించడానికి దశాబ్దాల వన్ చైల్డ్ పాలసీని అమలు చేస్తున్న చైనాలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. దీంతో 2016లో ఆ పరిమితిని ఇద్దరికి పెంచింది.
ఇదీ చూడండి:టీకా పంపిణీకి ప్రపంచ దేశాలు సన్నద్ధం.. కానీ...