కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తిరగబెడుతోంది. ప్రధానంగా సాంక్రమిక శక్తి అత్యంత ఎక్కువ ఉన్న డెల్టా రకం కరోనా వైరస్ కమ్మేస్తోంది. దీని దెబ్బకు ఇప్పుడు 'డ్రాగన్' అల్లాడుతోంది. చైనా వ్యాప్తంగా 18 ప్రావిన్సుల పరిధిలోని 27 నగరాలకు వ్యాపించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అనేక నెలలుగా కొవిడ్ కట్టడిలో విజయవంతమైన చైనాను తాజా ఉద్ధృతి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
తీవ్ర ముప్పు..
దేశంలో మధ్యస్థాయి, తీవ్ర ముప్పు ఉన్న ప్రాంతాల సంఖ్య 95కి పెరిగినట్లు అధికారిక మీడియా 'గ్లోబల్ టైమ్స్' తెలిపింది. వీటిలో డెహోంగ్, నన్‌జింగ్, ఝెంగ్‌జౌ సహా 4 ప్రాంతాలు 'తీవ్ర ముప్పు'లో ఉన్నట్లు తెలిపింది. రాజధాని బీజింగ్‌లో ఆదివారం బయటపడిన కొత్త కేసులు మూడింటికీ 'డెల్టా' వేరియంట్ కారణమని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) నిర్ధారించింది. కొవిడ్ వ్యాప్తి ఉన్న ప్రావిన్సుల నుంచి రాజధానికి అన్ని రకాల వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు బీజింగ్ మున్సిపల్ గవర్నమెంట్ ప్రకటించింది. చైనాలో తాజా కొవిడ్ ఉద్ధృతి నాన్‌జింగ్ విమానాశ్రయంలో కేసులు బయటపడటంతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అనంతరం వైరస్ అనేక ప్రాంతాలకు వ్యాపించింది. ఈ నగరంలో 204 కేసులు బయటపడ్డాయి.
కోటి మందికి పరీక్షలు..
దేశంలో బయట పడుతున్న చాలామేరకు కొత్త కేసులకు.. ఝాంగ్‌జియాజీలోని ఓ గ్రాండ్ థియేటర్‌లో ప్రదర్శించిన ఒక 'షో'తో కూడా సంబంధం ఉన్నట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది. ఈ ప్రదర్శనకు దాదాపు 2 వేల మంది హాజరు కాగా.. వారందరి సన్నిహితులు, కుటుంబ సభ్యులందరినీ గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొంది. నాన్‌జింగ్, ఝాంగ్‌జియాజీలతో పాటు అనేక నగరాల్లో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇటీవల ఈ రెండు నగరాలకు వెళ్లివచ్చిన వారినందరినీ గుర్తిస్తున్నారు. అధిక సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు కూడా జరుపుతున్నారు. ప్రయాణాలపై కూడా నిషేధం విధిస్తున్నారు. నాన్‌జింగ్‌లో లాక్‌డౌన్ విధించారు. ప్రముఖ పర్యటక కేంద్రమైన హైనన్ ద్వీపంలోనూ కేసులు బయటపడ్డాయి. ఝెంగ్‌జౌలో ఒకేసారి కోటి మందికి పరీక్షలు నిర్వహించడానికి అధికారులు నిర్ణయించారు.