భారత్‌పై మరోమారు తన అక్కసును వెళ్లగక్కింది చైనా. అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వం కల్పించే అంశంపై వ్యతిరేకతను మరోమారు వెల్లడించింది. కజకిస్థాన్ రాజధాని అస్థానాలో జరుగుతున్న ఎన్ఎస్జీ దేశాల రెండు రోజుల వార్షిక సదస్సులో భారత్ ప్రవేశానికి సంబంధించి ఎలాంటి చర్చ జరిగే అవకాశం లేదని డ్రాగన్ దేశం పేర్కొంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని దేశాల ప్రవేశంపై ఏకాభిప్రాయానికి రానంతవరకు ఎన్ఎస్జీలో భారత్ ప్రవేశానికి అవకాశం లేదని తెలిపింది.
2016లో దరఖాస్తు
48 దేశాల కూటమి అయిన ఎన్ఎస్జీలో చేరేందుకు 2016లో దరఖాస్తు చేసింది భారత్. మెజార్టీ సభ్యదేశాలు అనుకూలంగా ఉన్నా.. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం( ఎన్పీటీ) నియమ నిబంధనల పేరుతో భారత్ సభ్యత్వాన్ని చైనా అడ్డుకుంటోంది.