కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలోని వుహాన్ నగరంలో స్థానికంగా వైరస్ కేసులు నమోదుకావడం అక్కడి యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. దీంతో 1.1 కోట్ల జనాభా ఉన్న ఆ నగరంలో విస్తృతంగా కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. కరోనాను గుర్తించేందుకు న్యూక్లిక్ యాసిడ్ పరీక్షను ప్రారంభిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
కరోనా మొదట వెలుగులోకి వచ్చిన వుహాన్ నగరంలో 2020 ప్రారంభంలో కఠిన ఆంక్షలు అమలయ్యాయి. కట్టుదిట్టమైన చర్యలతో అక్కడ వైరస్ అదుపులోకి వచ్చింది. సోమవారం.. కొత్తగా 90 కేసులను గుర్తించినట్లు ఆ దేశ జాతీయ హెల్త్ కమిషన్ వెల్లడించింది. వీటిలో 61 కేసులు స్థానికంగా నమోదు కాగా, 29 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారిలో గుర్తించినట్లు తెలిపింది.
చైనాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతుండటం వల్ల పలు నగరాల్లో ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. రవాణా సదుపాయాలను కుదించింది. అలాగే భారీ స్థాయిలో నిర్ధరణ పరీక్షలను ప్రారంభించింది.