తొలిసారి చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్.. ఇప్పటికీ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే వైరస్ స్వస్థలంలో మాత్రం మహమ్మారి బాధితుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గతంలో రోజుకు వేల కేసులు నమోదవగా.. ప్రస్తుతం వాటి సంఖ్య రెండంకెలు కూడా దాటట్లేదు. తాజాగా యాక్టివ్ కేసుల సంఖ్య 100 కంటే దిగువకు చేరాయి. జనవరి తర్వాత నుంచి కోలుకునేవారు పెరగడం వల్ల ఇది సాధ్యమైంది.
" చైనాలో కొవిడ్-19 రోగులు భారీగా తగ్గుతున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య జనవరి నుంచి తొలిసారిగా 100 కంటే దిగువకు చేరుకుంది. వుహాన్ నగరంలో భారీ డ్రైవ్ నిర్వహించి 1 కోటి 10 లక్షల మందికి వైరస్ పరీక్షలు చేశాం"
-- చైనాలోని ఓ అధికారి
కేవలం 91
ప్రస్తుతం 91 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చైనా జాతీయ ఆరోగ్య కమీషన్ వెల్లడించింది. ఇది దేశ చరిత్రలో ఓ మైలు రాయిగా మిగిలిపోతుందన్నారు. అయితే దేశంలో మరో 15 కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో లక్షణాలు లేని కరోనా సోకినవారు 11 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
భయం గుప్పిట్లో ప్రజలు
లక్షణాలు లేకుండా కరోనా బారిన పడిన వారి సంఖ్య మొత్తం 619 చేరింది. వీటిలో వుహాన్లో 492 ఉన్నాయి. దేశంలో కొవిడ్-19 కేసులు తగ్గుతున్నప్పటికీ వైరస్ లక్షణాలు లేని కేసులు పెరగడం అక్కడి ప్రజల్లో భయాందోళన కలిగిస్తుంది.
చైనాలో ఇప్పటివరకు 82,933మంది వైరస్ బారిన పడగా... 4,633మంది కొవిడ్-19తో మృతి చెందారు. 78,209మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు తెలస్తోంది.
ఇదీ చూడండి:కరోనా వల్ల 2.8 కోట్ల మంది సర్జరీలు ఆగినట్లే!