China imposes lockdown: ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్.. చైనాలో విజృంభిస్తోంది. రెండేళ్ల తర్వాత గరిష్ఠస్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం కొత్తగా 3,400 కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. రోజువారీ కేసుల్లో ఇది రెండేళ్ల గరిష్ఠం. దీంతో జిన్‌పింగ్ సర్కారు అప్రమత్తమైంది.
ఇప్పటికే పలు నగరాల్లో లాక్‌డౌన్ విధించగా.. తాజాగా ఆంక్షలను మరింత విస్తరించింది. సాంకేతికంగా అతిపెద్ద నగరమైన షెన్‌జెన్‌లో.. చైనా లాక్‌డౌన్ విధించింది. ఈ నగరం హంకాంగ్‌తో సరిహద్దు కలిగి ఉంది. అక్కడ కేసులు అధికంగా ఉండడం వల్ల షెన్‌జెన్‌లోని 90లక్షల మందిని ఇంళ్లకే పరిమితం చేస్తూ అధికారులు అత్యవసర ఆదేశాలు జారీచేశారు. ఈ ఆంక్షలు ఈనెల 20వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.
ఇప్పటికే షాంఘైలో పాఠశాలలను మూసివేసిన చైనా.. మరికొన్ని నగరాల్లో లాక్‌డౌన్ విధించింది. 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. జిలిన్ నగరంలో పాక్షిక లాక్‌డౌన్ విధించారు. ఉత్తర కొరియా సరిహద్దులో ఉన్న యాంజిని నగరాన్ని.. పూర్తిగా దిగ్బంధించారు. ఇక్కడున్న 7లక్షల జనాభాకు.. ఇప్పటికే ఆరురౌండ్లు పరీక్షలు నిర్వహించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో 5లక్షల జనాభా కలిగిన యుచెంగ్‌లో కూడా ఆంక్షలు అమలు చేస్తున్నారు. కరోనా కారణంగా మొత్తం కోటీ 70లక్షల మందికిపైగా ప్రజలు గృహనిర్బంధంలో ఉన్నారు.