తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా తెచ్చే మార్పులు- ఇక మన లైఫ్​స్టైలే వేరు! - corona news in telugu

రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత సాంకేతిక పరిజ్ఞానం రాకెట్‌ వేగంతో పరుగులు తీసి జీవన శైలిలో గణనీయ మార్పులను తీసుకొచ్చింది. ఇప్పుడు కరోనా మహమ్మారి మన నిత్య జీవితంలో ఎన్నో మార్పులకు కారణమవుతోంది. మరి అవేంటో చూసేద్దామా?

implementation of strict lockdown in important cities worldwide
ఇక మన లైఫ్​స్టైల్ మారిపోతుంది!

By

Published : May 13, 2020, 7:04 AM IST

మార్పు.. మనిషి మనుగడకు ప్రాణవాయువు. ప్రపంచాన్ని కుదిపేసిన ఘటనలు పెను మార్పులకు పునాదులైనట్లు చరిత్ర చెబుతోంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన దశాబ్దాల తర్వాత మానవాళిని బాగా కలవరపెట్టిన అంశం కరోనా వైరస్‌. ఈ మహమ్మారి మానవ జీవితంలో ఎన్నో మార్పులకు బీజం వేస్తోంది. ఆధునిక నాగరకతకు పుట్టిళ్లుగా పేరున్న మహా నగరాల్లో ఇప్పటికే కొత్త మార్పులకు సన్నాహాలు మొదలయ్యాయి.

పార్కులకు కొత్త రూపు?

లాక్‌డౌన్‌లు తొలగించాక ప్రజలు పార్కులకు వెళితే మళ్లీ కరోనా వ్యాపించే ముప్పు పొంచిఉంది. ఈ నేపథ్యంలో పార్కులను సరికొత్త రూపంలో డిజైన్‌ చేయాలని ఆస్ట్రియాలోని ఓ డిజైనింగ్‌ సంస్థ ప్రతిపాదించింది. పార్కులో మూడు అడుగుల వెడల్పున కంచె మాదిరి చెట్లను పెంచి మధ్యలో పాదచారుల బాటను వదలాలని పేర్కొంది. ఇది పార్కులోకి వచ్చేవారికి దాదాపు 20 నిమిషాలపాటు నడక మార్గాన్ని సమకూరుస్తుంది. మిలన్‌ నగరంలో పార్కుల్లో బెంచీల మధ్య గాజు ఫలకను అమర్చాలని ఓ డిజైనర్‌ సూచించారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో పాదచారుల రోడ్లు దాటడానికి ఉపయోగించే 'క్రాస్‌వాక్‌ బటన్ల'ను తాకాల్సిన అవసరం లేకుండా చేయాలని నిర్ణయించాయి.

సైకిళ్లకు రాచమార్గాలు..

ప్రపంచవ్యాప్తంగా మహా నగరాల్లో కొవిడ్‌-19 వ్యాపించకుండా ప్రజారవాణా వ్యవస్థపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్‌ మొదలుకొని పెరూలోని లిమా వరకు చాలా వీధుల్లో సైకిళ్లు తిరిగేందుకు వీలుగా రోడ్లలో మార్పులు చోటుచేసుకొంటున్నాయి. పాదచారుల మధ్య దూరం ఉండేలా ఫుట్‌పాత్‌లను వెడల్పు చేస్తున్నారు. పబ్లిక్‌ పార్క్‌లను వదిలి రోడ్లపై వాకింగ్‌ చేసేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. కాలుష్యం వల్ల కూడా వైరస్‌ వ్యాపిస్తుండటంతో సైకిళ్లను ప్రోత్సహించడం అన్నివిధాలా సరైన మార్గమని పలు ఐరోపా దేశాలు భావిస్తున్నాయి.

  • పారిస్‌లో 400 మైళ్ల మేర సైకిల్‌ మార్గాలను ఏర్పాటు చేయాలని ఫ్రాన్స్‌ నిర్ణయించింది.
  • ఓక్లాండ్‌ (కాలిఫోర్నియా)లో 10 శాతం మార్గాల్లో సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించడం లేదు.
  • కొలంబియాలోని బొగొటాలో ఏకంగా 47 మైళ్ల మేర సైకిళ్లకు మార్గాలను తెరిచారు.
  • న్యూయార్క్‌ సిటీలో దాదాపు ఏడు మైళ్ల రోడ్డును ఓపెన్‌ స్ట్రీట్‌గా మార్చారు. ఇందులోకి కార్లను అనుమతించడంలేదు. పాదచారులు, సైకిళ్లను మాత్రమే అనుమతిస్తున్నారు.

రద్దీ ప్రదేశాలకు దూరంగా

వ్యాధి వ్యాపిస్తుందనే భయంతో ప్రజలు కూడా రద్దీ ప్రదేశాలను వీడి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మూడోవంతు అమెరికన్లు రద్దీ తక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లి నివసించాలని భావిస్తున్నట్లు హారిస్‌ పోల్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. వీరిలో కూడా 18 నుంచి 35 ఏళ్ల వయస్సు వారే ఎక్కువగా ఉన్నారు. ఈ రకంగా ఆలోచిస్తున్న వారిలో న్యూయార్క్‌ గవర్నర్‌ అండ్రూ క్యూమో వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పట్టణాన్ని విస్తరించి.. జనసాంద్రతను తగ్గించాలని ఆయన భావిస్తున్నారు.

ఇళ్ల నిర్మాణాల్లో మార్పులెన్నో..

ఇళ్ల నిర్మాణ విధానాల్లో మహమ్మారులు భారీ మార్పులు తీసుకొచ్చినట్లు చరిత్ర చెబుతోంది. స్పానిష్‌ ఫ్లూ విస్తరించినప్పుడు స్నానాల గదుల నిర్మాణంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అప్పుడే స్నానపు గదుల్లో వేరే కొళాయిలను, ముఖం కడుక్కొనే విధంగా సింక్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లతో ఇంటికి వచ్చే అతిథులు ప్రధాన మరుగుదొడ్లకు దూరంగా ముఖం కడుక్కోవడం వంటివి చేసేవారు. ప్రస్తుతం కొవిడ్‌-19 కూడా నిర్మాణాల్లో చాలా మార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువ మంది వచ్చివెళ్లే ప్రదేశాల్లో ఆటోమేటిక్‌ తలుపుల వినియోగం వంటివి పెరిగే అవకాశం ఉంది. వ్యాధి వ్యాప్తిని పరిశీలించేందుకు ఆయా నగరాల నుంచి వెలువడే మురుగును పరీక్షించే వ్యవస్థలను ప్రభుత్వాలు నిర్వహించవచ్చు. ఈ చర్యతో ఆయా పట్టణాల్లో ఎటువంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయనే అంశంపై ప్రభుత్వాలకు ఒక అవగాహన ఉంటుంది. చైనాకు చెందిన ఓ డిజైనర్‌ అత్యవసర సమయాల్లో వైద్య సదుపాయాలను పెంచుకొనేందుకు వీలుగా 'ఎపిడమిక్‌ బాబెల్‌' పేరుతో ఒక టవర్‌ను డిజైన్‌ చేశారు. ఏదైనా అంటువ్యాధి ప్రబలగానే ఈ టవర్‌ను వేగంగా సిద్ధంచేసి వైద్యసదుపాయాలను అందించవచ్చు.

ఇదీ చదవండి:'కరోనాతో వారికేమీ కాదన్నది పూర్తిగా అసత్యం'

ABOUT THE AUTHOR

...view details