అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ జో బైడెన్.. అతిబలహీనమైన అధ్యక్షుడని అన్నారు చైనా ప్రభుత్వ సలహాదారు జెంగ్ యోంగ్ నియన్. బైడెన్ అధికారం చేపట్టాక తమ దేశంతో యుద్ధానికి దిగవచ్చని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ దేశం సిద్ధమవ్వాలని వ్యాఖ్యానించారు. అమెరికాతో అనుబంధం పెంచుకోవడానికి దొరికిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు.
"మధురమైన ఆ పాతరోజులు వెళ్లిపోయాయి. అమెరికా చైనాల మధ్య ఎన్నో ఏళ్లుగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. అది ఒక్కరోజులో చల్లారేది కాదు. దీనివల్ల అమెరికన్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బైడెన్ ఈ సమస్యను పరిష్కరిస్తారని నేను అనుకోవడం లేదు. ఆయనో అతి బలహీనమైన అధ్యక్షుడు. తమ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైతే.. చైనాకు వ్యతిరేకంగా ఏమైనా చేయగలరు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు వ్యతిరేకి అయినా.. యుద్ధంపై మాత్రం ఆసక్తి చూపేవారు కాదు. కానీ, డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్.. యుద్ధాన్ని మొదలుపెట్టగలరు."