ఆగస్టు 15న అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు (afghanistan taliban) ఆక్రమించడం వల్ల యావత్ ప్రపంచం ఎన్నడూ చూడని దయనీయ దృశ్యాలను చూసింది. కరడుగట్టిన మనస్తత్వానికి పేరుగాంచిన తాలిబన్ల పాలనలో (afghan taliban) బతుకు దయనీయం అని తలచిన అఫ్గాన్ వాసులు అనేక మంది ప్రాణభయంతో దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేశారు. తాలిబన్ల దండయాత్ర ప్రారంభమైన మరుక్షణమే దేశాన్ని వీడేందుకు వేలాది మంది కాబుల్ విమానాశ్రయానికి వచ్చారు. వీసాలు, పాస్‌పోర్టులు అవసరం అన్న సంగతి కూడా పక్కన పెట్టి దొరికిన విమానమేదో ఎక్కి దేశం నుంచి పారిపోయే యత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆగస్టు 16న అమెరికా కార్గో విమానంలో (afghan plane incident) చోటు దక్కని కొందరు దాని చక్రాల పైభాగంలో ఎక్కి ప్రయాణం చేశారు. మరికొందరు విమానం వెంట పరుగులు తీశారు. వీరిలో ఇద్దరు విమానంపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోగా, ఒకరు దాని చక్రాల కింద నలిగి చనిపోయారు. వారి కుటుంబ సభ్యులు మృతుల జ్ఞాపకాలను తలచుకుని తల్లడిల్లిపోతున్నారు.
అఫ్గానిస్థాన్ జాతీయ జట్టుకు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు జకీ అన్వర్, సఫియుల్లా హోతక్ అనే మరొకరు విమానంపై నుంచి కిందపడి మృత్యువాత పడగా, ఫిదా మొహమ్మద్ అనే దంత వైద్యుడు విమానం చక్రాల కింద నలిగిపోయి ప్రాణాలు విడిచారు. నెల రోజులు గడిచినా మృతుల కుటుంబ సభ్యులు వారి జ్ఞాపకాలను మరవలేకపోతున్నారు. దంత వైద్యుడు ఫిదా మొహమ్మద్‌కు గత ఏడాదే వివాహం జరిగిందని, ఆ పెళ్లి కోసం చాలా ఖర్చు చేశామని ఆయన తండ్రి పైందా మొహమ్మద్ తెలిపారు. తన పెళ్లి కోసం చేసిన అప్పును తీర్చేందుకు విదేశాలకు వెళ్లి సంపాదించేందుకే విమానంపైకి ఎక్కే ప్రయత్నం చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కాబుల్‌లో ఆసుపత్రి నిర్మించాలన్న కలను కూడా తన కుమారుడు నెరవేర్చుకున్నాడని, కాని అంతలోనే ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.