అఫ్గానిస్థాన్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని(Taliban Government) ఏర్పాటు చేసిన తాలిబన్ల నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి(Afghanistan Prime Minister) .. మహమ్మద్ హసస్ అఖుంద్... గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులు తిరిగి రావాలని పిలుపునిచ్చారు. వారికి పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అఫ్గాన్‌లో రక్తపాతానికి తెరపడిందన్న ఆయన... ప్రస్తుతం దేశ పునర్నిర్మాణం అనే కీలక ప్రక్రియ మిగిలి ఉందని చెప్పారు.
"ఈ చారిత్రక ఘట్టం కోసం ఎన్నో ఏళ్లు కష్టపడ్డాము. భారీ మూల్యాన్ని మేం చెల్లించాం. పాత ప్రభుత్వంలో పని చేసిన అధికారులు.. దేశంలోకి తిరిగి రావాలని మేం అభ్యర్థిస్తున్నాం. వారికి పూర్తి భద్రత కల్పిస్తాం. సుదీర్ఘ యుద్ధాలను ఎదుర్కొన్న దేశాన్ని పునర్నిర్మించే బాధ్యత మనపై ఉంది."
-ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్, అఫ్గాన్ ఆపద్ధర్మ ప్రధాని.
గత ప్రభుత్వంలో అమెరికా నేతృత్వంలో పని చేసిన అధికారులకు తాము క్షమాభిక్ష ప్రసాదిస్తామని గతంలో తాలిబన్లు చేసిన వాగ్దానాన్ని హసన్ పునరుద్ఘాటించారు.
'అంత తొందర మాకు లేదు'
తాలిబన్ల ప్రభుత్వ గుర్తింపుపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. వారి ప్రభుత్వాన్ని గుర్తించడంలో తాము హడావుడిగా లేమని తెలిపింది. అయితే.. అఫ్గాన్ నుంచి తమ పౌరులను తీసుకురావడం కోసం తాలిబన్లతో సంప్రదింపులు జరపుతామని చెప్పింది. ఈ మేరకు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్‌సాకీ తెలిపారు.
"అధ్యక్షుడు కానీ, తమ ప్రభుత్వంలో ఇంకెవరైనా కానీ, తాలిబన్లు.. అంతర్జాతీయంగా గౌరవనీయులైన సభ్యులని భావించడం లేదు. తాలిబన్లపై సదభిప్రాయం ఏర్పడేలా వారు ఎప్పుడూ ప్రవర్తించలేదు. అఫ్గాన్‌లో ఉన్నది ఆపద్ధర్మ ప్రభుత్వం. వారి కేబినెట్లో నలుగురు మాజీ ఖైదీలు ఉన్నారు."
-జెన్ సాకీ, వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ.