అమెరికా బలగాల ఉపసంహరణ, అనంతరం తాలిబన్ల(Afghan Taliban) ఆక్రమణతో అఫ్గానిస్థాన్ తీవ్ర సంక్షోభాన్ని(Afghanistan crisis) ఎదుర్కొంటోంది. అటు ప్రజల్లోనూ తీవ్ర భయాందోళనలు మొదలు కాగా.. మరోవైపు ఆర్థికంగానూ తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పడ్డ రాజకీయ, ఆర్థిక సంక్షోభం నుంచి త్వరగా బయటపడే చర్యలు చేపట్టకపోతే వచ్చే ఏడాది (2022) నాటికి అఫ్గాన్‌లో 97శాతం మంది తీవ్ర పేదరికంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది.
అఫ్గానిస్థాన్‌లో ఉన్న తాజా పరిస్థితులతో దేశంలో 30శాతానికిపైగా పౌరులు నిత్యం కనీసం ఒకపూట భోజనం చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం ఆహార పరిస్థితే కాకుండా మానవ, ఆర్థిక సంక్షోభాలను పరిగణనలోకి తీసుకుంటే.. వాస్తవ జీడీపీ 13శాతం తగ్గిపోయి పేదరికం రేటు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) విశ్లేషించింది. అఫ్గాన్‌లో విపత్కర పరిస్థితులతో లక్షల మంది ప్రజల జీవితాలు మరింత వేగంగా క్షీణించే ప్రమాదం ఉందని యూఎన్‌డీపీ ఆసియా, పసిఫిక్ విభాగాధిపతి కన్నీ విగ్నరాజా పేర్కొన్నారు.