థాయిలాండ్లో ఓ సైనికుడు సైకోలా మారాడు. మిలటరీ క్యాంప్, షాపింగ్ మాల్లో కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు థాయిలాండ్ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
ఏం జరిగిందంటే?
సైన్యంలో జూనియర్ అధికారిగా పనిచేస్తున్న సార్జెంట్ మేజర్ జక్రపంత్ థోమా.. శనివారం సాయంత్రం నఖోన్ రాచసిమాలోని ఆర్మీ బ్యారెక్స్కు వచ్చాడు. అక్కడే ఉన్న సీనియర్ కమాండింగ్ అధికారిపై కాల్పులు జరిపాడు. ఆయనతో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తర్వాత బ్యారెక్స్ నుంచి ఆయుధాలు, ఓ వాహనాన్ని తస్కరించి నగరం నడిబొడ్డున ఉన్న టెర్మినల్ 21 షాపింగ్ సెంటర్లో ప్రవేశించాడు. వచ్చిన వెంటనే అక్కడున్న వారిపై కాల్పులు మొదలుపెట్టాడు. దీంతో జనం బెంబేలెత్తి అక్కడి నుంచి హాహాకారాలు చేస్తు బయటకు పరుగులు తీశారు. ఇక్కడ 17 మంది మరణించారు. తర్వాత దుండగుడు తన ఫేస్బుక్ ఖాతాలో దాడికి సంబంధించి పోస్టులు పెట్టాడు.