స్వలింగ సంపర్కుడిపై తాలిబన్లు తమ కర్కశత్వాన్ని(taliban atrocities) ప్రదర్శించారు. దాడి చేసి.. విచక్షణారహితంగా కొట్టారు. అంతేగాక, ఆ వ్యక్తిపై అత్యాచారానికి ఒడిగట్టి(taliban rape gay man) తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు. ఆ వ్యక్తి చేసిన పొరపాటల్లా.. దేశాన్ని విడిచి వెళ్లేందుకు ప్రయత్నించడమే!
ఇదీ జరిగింది...
హనాన్(వ్యక్తిగత గోప్యత కోసం పేరు మార్చాం) అనే వ్యక్తి అఫ్గాన్ నుంచి బయటకు వెళ్లేందుకు ఒకరి సహాయం కోరారు. సామాజిక మాధ్యమాల ద్వారా అతనితో మాట్లాడారు. తనకు సహాయం చేసే వ్యక్తిని కలవడానికి ముందు మూడు వారాల పాటు సామాజిక మాధ్యమాల్లోనే సంప్రదింపులు చేశారు. అయితే, ఆ వ్యక్తి తాలిబన్ మనిషేనని తెలుకోలేకపోయారు హనాన్. ఈ క్రమంలోనే ఇద్దరు తాలిబన్లు హనాన్పై దాడికి తెగబడి.. రేప్ చేశారు.
ఈ ఘటనపై అఫ్గాన్‌కు చెందిన ఎల్జీబీటీ హక్కుల ఉద్యమకారుడు ఆర్టెమిస్ అక్బరీ తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం టర్కీలో తలదాచుకుంటున్న ఆయన.. కొత్త పాలన అందిస్తామన్న తాలిబన్ల హామీలు నీటిపై రాతలేనని స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు.
"గత తాలిబన్ ప్రభుత్వంతో పోలిస్తే మరింత ఓర్పుగా ప్రస్తుత పాలన ఉంటుందని తాలిబన్లు చెబుతున్న మాట అవాస్తవం. స్వలింగ సంపర్కులను గుర్తించేందుకు సామాజిక మాధ్యమాలు తాలిబన్లకు బాగా ఉపయోగపడుతున్నాయి. వారు సామాజిక మాధ్యమాల్లో ఖాతా తెరిచి ఎల్జీబీటీ వ్యక్తులకు గాలం వేస్తున్నారు. స్వలింగ సంపర్కులమంటూ తమను తాము పరిచయం చేసుకుంటున్నారు. ఇలాగే.. హనాన్ను పరిచయం చేసుకొని దాడికి పాల్పడ్డారు. స్వలింగ సంపర్కుడన్న విషయాన్ని వాళ్ల ఇంట్లో వారికి చెబుతామని బెదిరించారు."
-ఆర్టెమిస్ అక్బరీ, ఎల్జీబీటీ హక్కుల ఉద్యమకారుడు