తెలంగాణ

telangana

ETV Bharat / international

Covid: 20వేల ఏళ్ల కిందటే మానవుల్లో కరోనా - ఆస్ట్రేలియన్​ నేషనల్​ యూనివర్శిటీ శాస్త్రవేత్తల కృషి

20వేల ఏళ్ల కిందటే తూర్పు ఆసియాను కరోనా ముంచెత్తిందని వెల్లడైంది. ఆధునిక చైనా, జపాన్‌, వియత్నాంలలోని ప్రజల డీఎన్‌ఏలో కొవిడ్​కు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని ఆస్ట్రేలియన్​ నేషనల్​ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలింది.

corona
కరోనా

By

Published : Jun 27, 2021, 6:54 AM IST

కరోనా వైరస్‌(Corona Virus) కోరల్లో మానవాళి చిక్కుకుపోవడం ఇదే మొదటిసారి కాదు. దాదాపు 20వేల ఏళ్ల కిందటే తూర్పు ఆసియాను ఇది ముంచెత్తిందని వెల్లడైంది. ఆధునిక చైనా, జపాన్‌, వియత్నాంలలోని ప్రజల డీఎన్‌ఏలో ఆ వైరస్‌ ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతాల్లో ఉంటున్న కొందరి జన్యువుల్లో కరోనా వైరస్‌లకు అనుగుణంగా సర్దుబాటు జరిగినట్లు గుర్తించారు. ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

కరోనా అనేది ఒక తరగతి వైరస్‌ల సమూహం. వీటిలో మెర్స్‌, సార్స్‌ సహా అనేక రకాల వైరస్‌లు ఉన్నాయి. ఈ రెండు రకాల వల్ల గత 20 ఏళ్లలో మహమ్మారులు ఉత్పన్నమయ్యాయి. ఆదిమానవుడి హయాంలోనూ వ్యాధికారక సూక్ష్మజీవుల విజృంభణలు జరిగాయి. మానవులు తన పుట్టినిల్లు అయిన ఆఫ్రికా నుంచి ప్రపంచమంతటా విస్తరించే క్రమంలో అనేక కొత్త సూక్ష్మజీవులను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో వాటిని తట్టుకొనేలా మన పూర్వీకుల్లో శారీరక, రోగ నిరోధకపరమైన సర్దుబాట్లు జరిగాయి. ఫలితంగా వారు ఇన్‌ఫెక్షన్లను తట్టుకొని మనుగడ సాగించే సామర్థ్యాన్ని సాధించారు. వేల ఏళ్ల నాటి వైరల్‌ విజృంభణల ఆనవాళ్లు మానవ జన్యువుల్లో నిక్షిప్తమై ఉంటాయి. ఇలాంటి జన్యుమార్పులను గుర్తించడానికి దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు పలు విధానాలను అభివృద్ధి చేశారు. ఫలితంగా పర్వత ప్రాంతాల్లో జీవనం వంటి వాటి వల్ల జరిగిన జన్యు సర్దుబాట్లను గుర్తించారు.

ఆనవాళ్లు ఇక్కడే..

వైరస్‌లు చాలా ప్రాథమిక స్థాయి జీవులు. తమకు సంబంధించిన ప్రతులను సాధ్యమైనంత ఎక్కువగా తయారుచేసుకోవడమే వీటి ప్రధాన లక్ష్యం. అయితే సొంతంగా వాటిని చేసుకునే సామర్థ్యం వాటికి లేదు. ఇతర జీవుల్లోని కణాలను హైజాక్‌ చేసి, ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాయి. ఈ క్రమంలో వాటిల్లో ఇన్‌ఫెక్షన్‌ కలుగజేస్తాయి. బాధిత జీవిలోని కణం ఉత్పత్తి చేసే నిర్దిష్ట ప్రొటీన్లతో వైరస్‌ చర్యలు జరుపుతుంటుంది. వాటిని వైరల్‌ ఇంటరాక్టింగ్‌ ప్రొటీన్లు (వీఐపీలు) అంటారు. వీటిలో మునుపటి విజృంభణల ఆనవాళ్లు ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. మునుపటి కరోనా మహమ్మారులను పసిగట్టేందుకు 2,500 మంది జన్యుక్రమాలను ఆధునాతన కంప్యూటేషనల్‌ విధానాలతో విశ్లేషించారు. వీఐపీలను ఉత్పత్తి చేసే 42 జన్యువుల్లో సర్దుబాటు సంకేతాలను గుర్తించారు. ఇవి కలిగినవారంతా తూర్పు ఆసియా దేశాలవారే. కరోనా తరగతి వైరస్‌లకు ఈ ప్రాంతం పుట్టినిల్లు కావడం గమనార్హం. సదరు 42 వీఐపీలు ప్రధానంగా ఊపిరితిత్తుల్లోనే ఉత్పత్తవుతున్నట్లు గుర్తించారు. కొవిడ్‌ లక్షణాల వల్ల ప్రధానంగా దెబ్బతినేది ఊపిరితిత్తుల కణజాలమే కావడం ఇక్కడ గమనార్హం. దీనికితోడు ఈ వీఐపీలు ప్రస్తుత కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌తో నేరుగా చర్యలు జరుపుతున్నట్లు వెల్లడైంది. దీన్నిబట్టి నేటి తూర్పు ఆసియా దేశాలకు చెందిన పూర్వీకులు దాదాపు 20వేల ఏళ్ల కిందట కరోనా వైరస్‌లకు తొలుత గురయ్యారని శాస్త్రవేత్తలు తేల్చారు.

ఇదీ చూడండి:కరోనాతో రష్యాలో మళ్లీ అల్లకల్లోలం

ABOUT THE AUTHOR

...view details