అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఏరివేతకు ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతున్నాయి ఆ దేశ భద్రతా దళాలు. హెల్మాండ్ రాష్ట్రం, లష్కర్ గాహ్ నగరంలో తాజాగా చేపట్టిన ఆపరేషన్‌లో 94 మంది తాలిబన్, అల్‌ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 16 మందికి తీవ్ర గాయాలైనట్లు అఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. గత వారం హెల్మాండ్ రాష్ట్ర రాజధానిలో తాలిబన్లు, బలగాల మధ్య భీకర పోరు జరిగినట్లు తెలిపింది.
తాజా ఆపరేషన్‌లో తాలిబన్ హెల్మాండ్ రెడ్ యూనిట్ కమాండర్ మవ్లావీ ముబారక్ హతమైనట్లు ట్వీట్ చేశారు అఫ్గాన్ రక్షణ శాఖ ప్రతినిధి ఫవాద్ అమాన్.
అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ నేపథ్యంలో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. దేశంలోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రభుత్వ, పోలీసు, ఆర్మీ అధికారుల బంధువులను అపహరించి హతమార్చుతున్నారు తాలిబన్లు.