అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణ చివరి దశకు చేరుకుంటున్న వేళ.. ఆ దేశంలో హింసాత్మక ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కాందహార్ రాష్ట్రంలోని స్పిన్ బోల్దాక్ జిల్లాలో 100 మందికిపైగా పౌరులను ఓ సాయుధ మూక హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇది కచ్చితంగా తాలిబన్ల చర్యేనని ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
"పాకిస్థాన్లో ఉన్న తమ నాయకుల ఆదేశాలతో స్పిన్ బోల్దాక్లో అఫ్గాన్ తాలిబన్లు.. అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎన్నో ఇళ్లను వారు దోచుకున్నారు. 100 మందికి పైగా పౌరులను బలిగొన్నారు. ఈ చర్యతో వారి అసలు క్రూర స్వరూపం ఏంటో బయటపడింది."
- అఫ్గాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ
గతవారం స్పిన్ బోల్దాక్ ప్రాంతాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. అక్కడి ఇళ్లను వారు దోచుకోవడమే కాకుండా.. ప్రభుత్వ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా ఓ వీడియోను ఫ్రాన్స్ 24 సంస్థ విడుదల చేసింది. పాకిస్థాన్లోని బలూచిస్థాన్తో సంబంధాలు నెరిపేందుకు వీలుగా ఉండే ఈ ప్రాంతంలో.. తాలిబన్లు తమ బైకులపై తిరుగుతూ ఇళ్లను దోచుకుంటున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. కొన్ని ఇళ్లపై తాలిబన్లు తమ జెండాను కూడా ఎగురవేసినట్లుగా కనిపించింది.