అమెరికాలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. బుధవారం ఏకంగా లక్షా 43 వేల 459 కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 614 మంది మరణించారు. ఏడు రోజుల సగటు కేసుల సంఖ్య 1.20 లక్షలుగా ఉంది.
అటు.. అగ్రరాజ్యంలోని అనేక రాష్ట్రాలు కొవిడ్‌తో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. లూసియానాలోని చాలా ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. అయితే, కేసులు ఇప్పుడే తీవ్ర స్థాయికి చేరలేదని నిపుణులు చెబుతున్నారు. రెండు, మూడు వారాల్లో కరోనా మరింత తీవ్రరూపు దాల్చే అవకాశం ఉందని చెప్పారు.
లూసియానాలో కరోనా వ్యాక్సినేషన్ సైతం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అమెరికాలో అత్యంత తక్కువ వ్యాక్సినేషన్ రేటు ఉన్న రాష్ట్రాల్లో లూసియానా నాలుగో స్థానంలో ఉంది. కేవలం 37శాతం మంది స్థానికులు రెండు డోసుల టీకాను తీసుకున్నారు.
చైనాలో ఇళ్లకు తాళాలు
మరోవైపు, చైనాలోనూ కరోనా తీవ్రంగా ఉంది. డెల్టా వ్యాప్తితో అక్కడి అధికారుల్లో ఆందోళన మొదలైంది. ప్రజలను బయటకు రానీయకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తైవాన్‌లో అయితే ప్రజలను ఇంట్లోనే ఉంచి బలవంతంగా తలుపులకు తాళాలు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రజలు ఒకరోజులో మూడు సార్లకు మించి తలుపులను తెరిస్తే.. వారి ఇళ్లకు తాళాలు వేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నట్లు వీడియోలో రికార్డయ్యాయి.