ట్విట్టర్ తన ఖాతాను శాశ్వతంగా నిషేధించడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. తనతో పాటు తనకు ఓటేసిన 7.5 కోట్ల మంది గళాన్ని నొక్కేందుకు ట్విట్టర్ ప్రయత్నిస్తుందన్నారు. అయితే ఈ విషయంపై తాము మౌనంగా ఉండబోమని ట్రంప్ అన్నారు. సొంతంగా ఓ సామాజిక మాధ్యమాన్ని రుపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
తన వ్యక్తిగత ఖాతాను నిషేధించడం వల్ల అధ్యక్షుడి అధికారిక ట్విట్టర్ (ప్రెసిడెంట్ ట్రంప్) ద్వారా ట్రంప్ ఈ మేరకు స్పందించారు.
"ట్విట్టర్ వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తోంది. డెమొక్రాట్లు, ర్యాడికల్ లెఫ్ట్‌తో ట్విట్టర్ ఉద్యోగులు కుమ్మక్కయ్యారు. ట్విట్టర్ ఓ ప్రైవేట్ కంపెనీ.. ప్రభుత్వం దాఖలు పరిచే సెక్షన్ 230 లేకుంటే వారు ఎక్కువకాలం మనుగడ సాగించలేరు.
త్వరలో ఓ భారీ ప్రకటన ఉండే అవకాశం ఉంది. సొంతంగా ఓ సామాజిక మాధ్యమాన్ని రూపొందించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నాం. ఇతర వెబ్‌సైట్లతో మాట్లాడుతున్నాం. తమ గళాన్ని ఎవరూ నొక్కేయలేరు. "