అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, బిడెన్ మధ్యే పోటీ! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. ఫ్లోరిడా, ఇల్లినాయీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రాథమిక ఎన్నికల్లో గెలిచిన ట్రంప్.. అధ్యక్ష అభ్యర్థిగా తానే తగిన వ్యక్తి అని నిరూపించుకున్నారు.
సరిలేరు ఆయనకెవ్వరూ!
73 ఏళ్ల ట్రంప్‌కు... రిపబ్లికన్ పార్టీ ప్రాథమిక ఎన్నికల్లో ఎవ్వరూ సరైన పోటీ ఇవ్వలేకపోయారు. అందువల్ల ఆయనే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అని.. ఇందుకు ఫ్లోరిడా, ఇల్లినాయీ ఫలితాలే ముందస్తు సూచికలని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
"అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో... రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా నిలిచినందుకు డొనాల్డ్ ట్రంప్‌కు శుభాకాంక్షలు."
- రోనా మెడ్డానియల్, రిపబ్లికన్ పార్టీ ఛైర్పర్సన్ ట్వీట్
డెమొక్రటిక్ అభ్యర్థిగా జో బిడెన్!
ఫ్లోరిడా, ఇల్లినాయీ, అరిజోనాలో జరిగిన డెమొక్రటిక్ పార్టీ ప్రాథమిక ఎన్నికల్లో జో బిడెన్ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి బెర్నీ శాండర్స్‌పై గెలిచారు.
తాజా విజయాలతో 77 ఏళ్ల జో బిడెన్... డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు తన అవకాశాలు మెరుగుపరుచుకున్నారు. నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఎదురు నిలిచే అవకాశం జో బిడెన్‌కే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:అదృశ్య శక్తితో యుద్ధం చేస్తున్నాం: ట్రంప్