వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి హెర్డ్ ఇమ్యునిటీ ఒకటే మార్గమని మొదటి నుంచి అమెరికా నిపుణులు చెబుతున్నారు. దేశంలో 60శాతం నుంచి90 శాతం మంది వ్యాక్సిన్ తీసుకుంటేనే అది సాధ్యపడుతుందని భావించారు. అయితే అమెరికాలో కేవలం 35 శాతం మందికి మాత్రమే ఇప్పటివరకు వ్యాక్సినేషన్ అందింది. అయినప్పటికీ దేశ అమెరికాలో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదన సీడీసీ ప్రకటించింది. హెర్డ్ ఇమ్యునిటీ అంటే ఏమిటి? అది ఎప్పుడు వస్తుంది? దానికి ఉన్న ప్రధాన అవరోధాలు ఏంటి?
కొవిడ్-19, హెర్డ్ ఇమ్యునిటీపై అమెరికా, వర్జీనియా యూనివర్సిటీలో అంటువ్యాధులపై పరిశోధనలు చేసిన ప్రోఫెసర్ డా. విలియమ్ పెట్రీ కీలక విషయాలను వెల్లడించారు.
హెర్డ్ ఇమ్యునిటీ అంటే..
వైరస్ వ్యాప్తిని అడ్డుకునేలా సమాజంలో ఎక్కువ మంది రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం. వైరస్ సంక్రమణను నిరోధక శక్తి కలిగిన వ్యక్తులు అడ్డుకుంటారు. నిరోధక శక్తి లేనివారు వీరితో రక్షణ పొందుతారు. హెర్డ్ ఇమ్యుునిటీ వ్యాక్సినేషన్ ద్వారానైనా రావచ్చు. ఎక్కువ మందికి వ్యాధి సోకి నయమవడం ద్వారానైనా పొందవచ్చు.
ఇతర వ్యాధుల్లో సాధ్యమైందా?
1980 లో సంక్రమించిన ఆటలమ్మ (స్మాల్ ఫాక్స్)ను ప్రపంచమంతా హెర్డ్ ఇమ్యునిటీతోనే ఎదిరించింది. కొన్ని దేశాలు పోలియో విషయంలోనూ హెర్డ్ ఇమ్యునిటీని సాధించాయి. అయితే ప్రపంచమంతా సమష్టి కృషితో ముందుకు వెళ్లినప్పుడే ఇది సాధ్యపడుతుంది.
ప్రధాన అవరోధాలు..
అందరికీ వ్యాక్సిన్ అందకపోవడం హెర్డ్ ఇమ్యునిటీని సాధించకపోవడానికి ప్రధాన అవరోధంగా భావించవచ్చు. పిల్లలకు, యుక్తవయసు వారికి వ్యాక్సిన్ అందించడానికి ఇప్పుడు అమెరికాలో ఫైజర్-బయోటెక్ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అమెరికాలో దీనిని సాధించవచ్చు. వ్యాక్సిన్ అందుబాటులో లేని దేశాల నుంచి వచ్చినవారికి కొత్తగా వైరస్ సోకే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటికిప్పుడు హెర్డ్ ఇమ్యునిటీని సాధించడం కష్టమైన పనే. కానీ సంవత్సరాల తరబడి ప్రయత్నిస్తే స్మాల్ ఫాక్స్‌ను పారదోలినట్లు కరోనాను అంతమొందించవచ్చు.
హెర్డ్ ఇమ్యునిటీ సాధించకపోతే ఎలా..
2022 ఏడాది చివరి నాటికి కూాడా కరోనా వైరస్ విషయంలో హెర్డ్ ఇమ్యునిటీ సాధించే అవకాశాలు కనిపించడం లేదు. సీజన్ ను బట్టి వైరస్ తగ్గుతూ.. పెరుగుతూ పోతోంది. వేసవిలో తక్కువగా, శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది. తగ్గినప్పుడు నిబంధనలను ప్రభుత్వాలు సడలిస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారు మాస్క్ ధరించనవసరం లేదని సీడీసీ మే13న ఇచ్చిన ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి సడలింపుల కారణంగా మరింత విస్తరించే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైరస్‌ను అరికట్టేందుకు మరిన్ని పరిశోధనలు జరగాలి.
ఇదీ చదవండి:కొవిడ్ రిపోర్టు లేక పడక దొరకలేదు.. ప్రాణం ఆగలేదు..