బార్బరా మిల్లిసెంట్ రాబర్ట్స్ అంటే ఎవరా అని ఆలోచిస్తాం అంతా. కానీ 'బార్బీ డాల్' అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తాం. చిన్నప్పుడు బార్బీ బొమ్మలతో ఆడుకున్న జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికీ మధుర జ్ఞాపకమే. ఫ్యాషన్ డాల్‌గా ప్రపంచానికి పరిచయమైనా... ఈ బొమ్మ వెనుక పెద్ద కథే ఉంది. బార్బీ బొమ్మను మొదట తయారు చేసింది రూత్ హ్యాండ్లర్. తన కూతురు బార్బరా కోసం దీన్ని రూపొందించారామె. 1959వ సంవత్సరంలో తొలిసారి న్యూయర్క్ టాయ్ ఫెయిర్‌లో కనువిందు చేసింది బార్బీ. అప్పటి నుంచి 200 పాత్రల్లో ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది. రోబో, ఇంజినీర్, జర్నలిస్టు, వ్యాపారవేత్త, వ్యోమగామి ఇలా అనేక పాత్రల్లో ఆశ్చర్యపరిచింది. 'మానవుడు చంద్రుడి మీద కాలుమోపడం కన్నా ముందే 1965లో బార్బీ కేరక్టర్ అంతరిక్షంలోకి వెళ్లింది'.
రాజకీయాల్లోనూ అరంగేట్రం చేసిన ఈ ముద్దులబొమ్మ... 1992 నుంచి ఆరుసార్లు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడిన తొలి మహిళా అభ్యర్థిగా పేరుగాంచింది. 2016లో అమెరికా అధ్యక్ష స్థానానికి బరిలో నిలిచినా గెలవలేదు.
2015 నుంచి బార్బీ శరీర ఆకృతితో పాటు చర్మ రంగు, రంగు రంగుల కళ్లు, మైమరిపించే జుత్తును జనాల అభిరుచికి తగ్గట్టుగా మారుస్తున్నారు తయారీదారులు. 1987 నుంచి ఈ బొమ్మ సినిమాలు, వీడియోగేమ్‌లు, యానిమేషన్ చిత్రాలు, టీవీల్లో, పాటల్లో కనిపించి అలరించింది.
ప్రపంచవ్యాప్తంగా పరిచయం ఉన్న ఈ బొమ్మ 60వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రత్యేకమైన బార్బీ బొమ్మల శ్రేణిని విడుదల చేయనున్నారు. న్యూయర్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, టోక్యో స్కై ట్రీ, సిడ్నీలోని బోండాయ్ బీచ్‌లో బార్బీ వేడుకలు ఏర్పాటు చేస్తున్నారు.
'సమయానికి కొలమానంగా బార్బీని పోల్చవచ్చు. సంప్రదాయాలను కలుపుతూ, మహిళలు ఎలా ఉండాలనుకుంటున్నారో వివరిస్తోంది. ఈ బొమ్మ ఒక రోల్‌మోడల్ లాంటిది. దీని నుంచి స్ఫూర్తి పొందొచ్చు. సాధ్యమైనంత వరకు ప్రపంచంలోని సంస్కృతిని బార్బీ బొమ్మ తయారీలో సమ్మిళితం చేస్తున్నాం. మరో 60 ఏళ్లయినా ఇలాగే ప్రజల అభిమానాన్ని చూరగొంటుంది.'
- లిసా, జనరల్ మేనేజర్ బార్బీ
2015లో పూర్తిగా విభిన్న పంథా అనుసరిస్తున్నాం. శరీర ఆకృతిలో మార్పులు చేశాం. విభిన్న రంగుల చర్మం, కళ్లు, జుత్తుతో బొమ్మలను రూపొందిస్తున్నాం. ఈ బొమ్మ ద్వారా సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాం. మేము వాడుతున్న ఫైబర్ జుట్టు నిజమైనదిలాగే ఉంటుంది. ఆఫ్రికా, అమెరికా దేశాల్లో ఆచారాన్ని బట్టి బొమ్మలకు దుస్తులు వేస్తున్నాం. తల నుంచి కింద వరకు ఎన్నో అలంకరణలు రూపొందిస్తున్నాం. సంస్కృతి ఇదొక చిహ్నంగా నిలుస్తోంది అదే మాకు చాలా సంతోషాన్నిస్తోంది.
-కిమ్ కల్మొన్, బార్బీ డిజైనర్