వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రత విషయంలో లోపాలతో ఫేస్‌బుక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు ఏకంగా 500 కోట్ల డాలర్ల భారీ జరిమానా విధించాలని అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్-ఎఫ్‌టీసీ నిర్ణయించింది. గోప్యత ఉల్లంఘనలపై ఎఫ్‌టీసీ ఇప్పటివరకు విధించిన జరిమానాల్లో ఇదే అత్యంత ఎక్కువ మొత్తం. అయితే... ఈ ప్రతిపాదనకు న్యాయ శాఖ తుది ఆమోదం తెలపాల్సి ఉంది.
వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం!
2016లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా రాజకీయ ప్రచారం నిర్వహించిన కేంబ్రిడ్జ్ అనలిటికా... 10 లక్షలమంది ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణ. ఈ విషయం వెల్లడైన తరువాత... 2011 నాటి ఫేస్బుక్ గోప్యతా ఉల్లంఘనలపై విచారణను గతేడాది తిరిగి ప్రారంభించింది ఎఫ్‌టీసీ. చివరకు 5 బిలియన్ డాలర్ల జరిమానా విధించాలని నిర్ణయించింది.