అగ్రరాజ్యం అమెరికా అద్యక్ష పీఠం ఎవరిదన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐదు కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతున్న సమయంలో.. ట్రంప్ ఆధిక్యంలో ఉన్న జార్జియాలో బైడెన్ రేసులోకి వచ్చారు.
- జార్జియా(16)లో తారుమారైన ఆధిక్యం
- 917 ఓట్ల ఆధిక్యంతో బైడెన్ ముందంజ
- జార్జియాలో విజయం సాధిస్తే బైడెన్‌దే అద్యక్ష పీఠం
- విజయానికి 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో ఉన్న జో బైడెన్
విజేతను నిర్ణయించే జార్జియా..
ఇప్పటికే 264 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లతో ఉన్న డెమొక్రాట్ అభ్యర్థి బైడెన్‌కు మ్యాజిక్ ఫిగర్ '270' అందుకోడానికి ఆరు సీట్లే అవసరం. అయితే ప్రస్తుతం జార్జియా(16 సీట్లు) నెగ్గితే అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించనున్నారు జో బైడెన్. ఇక్కడ ఓడితే ట్రంప్‌నకు దాదాపు విజయావకాశాలు గల్లంతైనట్లే. మిగతా నాలుగు చోట్ల ట్రంప్(214) గెలిచినా మ్యాజిక్ మార్క్‌ను అందుకోలేరు.
సుప్రీం నిర్ణయం కీలకమా..!
ఒకవేళ బైడెన్ మెజార్టీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లతో మ్యాజిక్ ఫిగర్‌ను అందుకున్నా.. వెంటనే అధికారికంగా విజేతగా ప్రకటించే అవకాశాలు లేవు. ట్రంప్ న్యాయపోరాటానికి సిద్ధమవడం వల్ల తుది విజేత కోర్టులోనే తేలే అవకాశం ఉన్నట్లు విశ్లేషణలూ వెలువడుతున్నాయి.
రీకౌంటింగ్ జరుగుతుందా?
ట్రంప్.. జార్జియాలో రీకౌంటింగ్ దిశగా వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. నిబంధనల ప్రకారం గెలుపు మార్జిన్ 0.5శాతం, అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఓడిపోయిన అభ్యర్థి రీకౌంటింగ్ కోరే అవకాశం ఉంటుంది. అయితే ఫలితాలు వెలువడిన రెండు రోజుల్లోపే సదరు అభ్యర్థి పునఃలెక్కింపునకు అభ్యర్థించాలి. ఒకవేళ తాజా ఫలితాల్లో ట్రంప్ ఓడిపోతే ఆయనకు రీకౌంటింగ్ కోరే హక్కు ఉంటుంది.
జార్జియా ఫలితం.. సెనెట్‌పై ప్రభావం
జార్జియాలో బైడెన్ గెలిస్తే సెనెట్‌లో డెమొక్రాట్ల బలం పెరుగుతుంది. అప్పుడు చట్టాలు ఆమోదించడానికి, కీలక నియామకాలు చేపట్టడానికి డెమొక్రటిక్ పార్టీకి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఒకవేళ జార్జియాలో ఓడిపోయి.. బైడెన్ అధ్యక్షుడైతే(మిగిలిన రాష్ట్రాల్లో ఎలక్టోరల్ ఓట్లు వస్తే) మాత్రం సెనెట్‌లో ఇబ్బందులు తప్పవనేది విశ్లేషకుల అభిప్రాయం.
మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా..
ఫలితం తేలని మిగతా నాలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పెన్సిల్వేనియా, అలస్కా, నార్త్ కరోలినాలో ట్రంప్ ముందంజలో ఉండగా.. నెవడాలో మాత్రం బైడెన్ దూసుకెళ్తున్నారు. జార్జియా, నెవాడా డెమొక్రాట్ల వశమైతే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలుపు ఖాయమైనట్లే.