అమెరికా-చైనా మధ్య సంబంధాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. తాజాగా చైనాపై అదనపు చర్యలు చేపట్టడానికి అమెరికా సన్నద్ధమవుతోంది. ఈ విషయాన్ని శ్వేతసౌధం వెల్లడించింది. అయితే ఈ చర్యలు ఏ విధంగా ఉంటాయనే దానిపై మాత్రం ట్రంప్ సర్కార్ స్పష్టతనివ్వలేదు.
"రానున్న రోజుల్లో చైనాపై చర్యలు చేపడతాం. అయితే అవి ఏమిటనేది మాత్రం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచే మీరు వింటారు. కానీ నేను ఒకటి చెప్పగలను.. చైనాపై కచ్చితంగా చర్యలు ఉంటాయి."
-- కైలీ మెక్ఎనానీ, శ్వేతసౌధం అధికార ప్రతినిధి.
కరోనా వైరస్ మహమ్మారి.. ప్రపంచమంతటా వ్యాప్తిచెందడానికి చైనా తప్పిదాలే కారణమంటూ అనేకమార్లు మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనాపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. హాంగ్కాంగ్ జాతీయ భద్రతా బిల్లు, అమెరికా జర్నలిస్టులపై ఆంక్షలు, టిబెట్ పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో శ్వేతసౌధం చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.