అగ్రరాజ్యంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలపై సైబర్ దాడి జరిగింది. ట్రెజరీ, వాణిజ్యం తదితర పలు శాఖల వెబ్‌సైట్లపై హ్యాకర్లు దాడిచేసినట్టు సమాచారం. ఈ సంఘటన వెనుక రష్యా హస్తముందని అధికారులు అనుమానిస్తున్నారు. అమెరికాకు సంబంధించిన కీలక సమాచారాన్ని కొల్లగొట్టేందుకు రష్యా ప్రభుత్వం దాడికి ప్రయత్నించే అవకాశాలున్నాయని.. అమెరికా నిఘా విభాగం హెచ్చరించిన కొద్ది రోజులకే ఈ దాడి చోటుచేసుకోవటం గమనార్హం. ఈ సైబర్ దాడి ప్రభావం అధికంగానే ఉండగలదని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా జాతీయ నిఘా సంస్థ ఎఫ్‌బీఐ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీకి చెందిన సైబర్ భద్రతా విభాగం ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించాయి.
అమెరికా ప్రభుత్వ శాఖలపై సైబర్ దాడి - cyber attack by russia hackers in usa
అమెరికాలోని ప్రభుత్వ శాఖలు, సంస్థలపై సైబర్ దాడి జరిగింది. రష్యా హ్యాకర్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ సైబర్ దాడి ప్రభావం అధికంగానే ఉండగలదని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులున్న అమెరికా సాంకేతిక దిగ్గజ సంస్థ ఫైర్ ఐ.. విదేశీ హ్యాకర్లు తమ నెట్‌వర్క్ పరిధిలోకి చొరబడి, సంస్థకు చెందిన కొన్ని హ్యాకింగ్ టూల్స్ చోరీ చేసినట్టు ప్రకటించిన కొద్ది రోజులకే తాజా ఘటన చోటుచేసుకుంది. కాగా, 2014లో కూడా రష్యాకు చెందిన హ్యాకర్లు అమెరికా ప్రభుత్వ ఈ-మెయిల్ వ్యవస్థలోకి అక్రమంగా చొరబడ్డారు. తాజా సైబర్ దాడికి దారితీసిన పరిస్థితులను గుర్తించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నట్టు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ ఉలియట్ తెలిపారు.