అమెరికా, చైనా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్ జూన్ నెలలో భేటీ అయ్యే అవకాశముందని శ్వేతసౌధం ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో తెలిపారు. జీ-20 సదస్సుకు అనుబంధంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం, విబేధాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే ఈ చర్చలకు ఇంకా షెడ్యూల్ ఖరారు చేయలేదని తెలిపారు.
అమెరికా, చైనాల మధ్య రెండు రోజులపాటు మరోసారి జరిగిన వాణిజ్య చర్చలు ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిశాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతాయని, అయితే కచ్చితమైన ప్రణాళికలేవీ లేవని లారీ కుడ్లో తెలిపారు.
మరోవైపు భవిష్యత్ వాణిజ్య చర్చల కోసం తమ దేశం రావాలని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ నుచిన్, అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైటిజర్ను చైనా ఆహ్వానించింది.
ఒసాకాలో జూన్ 28-29 తేదీల్లో జరిగే జీ-20 సదస్సుకు ట్రంప్, జిన్పింగ్ హాజరుకానున్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై కూడా వారిరువురూ చర్చించుకునే అవకాశం మెండుగా ఉంది.