అమెరికాలో కరోనా విజృంభిస్తుంటే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో సంచలన వ్యాఖ్య చేస్తున్నారు. కరోనాపై రోజువారీ మీడియా సమావేశాలతో తన విలువైన సమయం వృథా అవుతుందన్నారు.
శ్వేతసౌధంలో మీడియా సమావేశాలను రద్దు చేస్తారన్న వార్తలకు ట్రంప్ వ్యాఖ్యలు బలం చేకూర్చుతున్నాయి. రెండు నెలల్లో 50 మీడియా సమావేశాల్లో పాల్గొన్న ట్రంప్ శనివారం దూరంగా ఉన్నారు.
"ఓ వర్గం మీడియా ప్రతినిధులు అసందర్భ ప్రశ్నలు వేసి విసిగిస్తారు. ఆ తర్వాత వారి ప్రసారాల్లో వాస్తవాలను కూడా వెల్లడించరు. ఈ పరిస్థితుల్లో శ్వేతసౌధంలో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి ఏం ప్రయోజనం?
వాళ్లకు రికార్డు రేటింగ్స్ వస్తాయి. అమెరికా ప్రజలకు మాత్రం నకిలీ వార్తలు చేరుతున్నాయి. ఈ సమావేశాలకు వెచ్చించే తన విలువైన సమయం, చేసే కృషి రెండు వృథానే."